న్యూయార్క్ : ప్రపంచానికి డిజిజ్ ఎక్స్ అత్యంత ప్రమాదకర మహమ్మారి అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఓ) హెచ్చరించింది. కరోనాతో పోలిస్తే ఈ అంటువ్యాధి 20 రెట్లు ప్రమాదకారి అని, ఇది సోకితే ప్రపంచవ్యాప్తంగా కనీసం ఐదుకోట్ల మంది వరకూ చనిపోయే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గెబ్రెయెసిస్ అధికారిక ప్రకటన వెలువడింది.చాలారోజుల క్రితమే ఈ ఎక్స్ వైరస్ గురించి తమ సంస్థ పలు విశ్లేషణలు, హెచ్చరికలు వెల్లడించిందని, ఇప్పటికైనా ఈ మరో మహమ్మారిపై అంతా అప్రమత్తం కావల్సి ఉందని తెలిపారు. ప్రపంచ దేశాలు ఈ సూక్ష్మకణజీవి కదలికలు, దీనితో తలెత్తే భీకర వ్యాధి పట్ల ఆద్యంతం జాగ్రత్తలు తీసుకోవల్సి ఉందన్నారు. సమన్వయం, శాస్త్రీయ సన్నద్ధత, సమాచార వినిమయం,
పలు స్థాయిల్లో ఆరోగ్య వైద్య చికిత్సల వ్యవస్థల బలోపేతం అత్యవసరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత స్పష్టం చేశారు. ఇటీవల ముగిసిన ప్రపంచ ఆర్థిక సమాఖ్య (డబ్లుఇఎఫ్) సదస్సులో కూడా టెడ్రోస్ ఈ ఎక్స్ వైరస్ , దీని వల్ల తలెత్తే ముప్పు గురించి ప్రపంచ దేశాలను హెచ్చరించారు. దీని ఫలితంగానే ఈ సదస్సు నేపథ్యంలో రెండు మూడు గంటల పాటు దీనిపై చర్చ జరిగిందని సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత దశలో ఆర్థిక అసమానతలు కీలక సమస్యగా మారుతున్నాయి. సంపన్న దేశాలు తమకున్న ఆర్థిక వనరులతో ఎక్కువగా అవసరాలను మించి టీకాలను సంతరించుకుంటున్నాయి. దీనితో వీటి అవసరార్థులు కొరత ఎదుర్కొంటున్నారని ఆరోగ్య సంస్థ ఆందోళ వ్యక్తం చేసింది.