సిట్ అధికారిని మరోసారి ప్రశ్నించిన కమిషన్
మనతెలంగాణ/హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సురేందర్‌రెడ్డిని కమిషన్ సభ్యులు రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. విచారణలో భాగంగా ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సిట్ నివేదికలో పొందుపర్చిన అంశాలపై ప్రశ్నించారు. ఇదిలావుండగా గత నెల 26, 27, 28 తేదీల్లోనూ సురేందర్‌రెడ్డిని కమిషన్ విచారించిన క్రమంలో మరికొన్ని అంశాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు కమిషన్ సభ్యులు మరోసారి సురేందర్‌రెడ్డి విచారించినట్లు సమాచారం. ఈ కేసులో మరో ఒకరిద్దరూ పోలీస్ అధికారులను ప్రశ్నించేందుకు కమిషన్ సభ్యులు సమాయత్తమవుతున్నారు. దిశ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన కుటుంబ సభ్యుల నుంచి సాక్ష్యాన్ని కమిషన్ శుక్రవారం నాడు సేకరించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో మృతుల కుటుంబ సభ్యులకు కమిషన్ కార్యదర్శి నుంచి సమాచారం చేరవేశారు. కమిషన్ ఆదేశాలతో మృతుల కుటుంబ సభ్యులకు భద్రత కల్పించామని, ముఖ్యంగా గుండ్లపల్లి, జక్లేర్‌లో వాళ్ల ఇళ్ల వద్ద పికెట్ ఏర్పాటు చేశామని తెలిపారు. పోలీసుల భద్రత నడుమ మృతుల కుటుంబ సభ్యులను శుక్రవారం నాడు కమిషన్ వద్దకు తీసుకురానున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరిస్తున్నారు.