Friday, March 21, 2025

ఆదిత్య థాక్రే పై కేసు నమోదు చేయండి..

- Advertisement -
- Advertisement -

ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ , మాజీ మేనేజర్ దిశా సాలియన్ తండ్రి సతీశ్ సాలియన్ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాక్రేపై కేసు నమోదు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఆదిత్య థాక్రేకు వ్యతిరేకంగా ఆయన న్యాయస్థానాన్ని సంప్రదించడం మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పిటిషన్‌లో ఆదిత్య థాక్రే పై లైంగిక ఆరోపణలు చేశారు. ఐదేళ్ల క్రితం బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నటుడి మరణానికి వారం రోజుల ముందు అతడి మాజీ మేనేజర్ దిశా సాలియన్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు.

2020 జూన్ 8 న ముంబై లోని ఓ భవనంపై నుంచి దూకి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. దిశా చనిపోయిన రోజుల వ్యవధిలోనే నటుడు సుశాంత్ తన ఫ్లాట్‌లో శవమై కనిపించారు. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ఈ కేసును కప్పిపుచ్చుకునేందుకు యత్నించిందనే ఆరోపణలు వచ్చాయి. హత్య, అత్యాచారంతో పాటు సుశాంత్ మృతి తోనూ ముడిపెడుతూ ప్రచారం సాగింది. నాడు తన కుమార్తె మృతికి సంబంధించి ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదు సతీశ్ సాలియన్. ప్రస్తుతం ఆదిత్యథాక్రేతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

జూన్ 8న తన కుమార్తె ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసిందని, దానికి ఆదిత్యథాక్రేతోపాటు అతని బాడీ గార్డులు , నటులు సూరజ్ పంచోలి, డినోమోరియా , మరికొందరు హాజరయ్యారని, తాజాగా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆమె లైంగిక వేధింపులకు గురైందని, తన కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపించారు. ఈ కేసుపై విచారణ జరిపించాలని కోరారు. ప్రస్తుతం ఈ అంశం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అవన్నీ అబద్ధాలే: ఆదిత్య థాక్రే
ఈ నేపథ్యంలో ఆదిత్య థాక్రే స్పందిస్తూ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టి పారేశారు. “నాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. నా పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేందుకు ఐదేళ్లుగా ప్రయత్నం జరుగుతోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంటే… నేను న్యాయస్థానం లోనే స్పందిస్తాను” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News