మన తెలంగాణ / హైదరాబాద్ : విద్యుత్ సంస్థలలో అత్యవసర సర్వీసుల చట్టం – ఎస్మా అమలులో ఉందని చెప్పినప్పటికీ వినకుండా సమ్మెలో పాల్గొన్న 200 మంది ఆర్టిజన్లను విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ట్రాన్స్ కో,జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు మంగళవారం నాడొక ప్రకటనలో తెలిపారు. అలాగే బుధవారం ఉదయం లోగా విధులకు హాజరు కాని ఆర్టిజన్లను విధుల నుండి తొలగిస్తూ మళ్లీ ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఆర్టిజన్ల సర్వీసు నిబంధన 34 (20) ప్రకారం ఈ సమ్మె చట్ట విరుద్దంగా (మిస్ కాండక్ట్ కింద )పరిగణించబడుతుందని ముందుగానే ఆర్టిజన్లు అందరికీ తెలియజేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో సుమారు 200 మంది ఈ చట్ట వ్యతిరేక సమ్మెలో పాల్గొన్నట్టు గుర్తించి చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వినియోగదారులకు అందిస్తోన్న 24 గంటల విద్యుత్ సరఫరాను భగ్నం చేసే ఏ దుశ్చర్యలనూ ఉపేక్షించడం జరుగదన్నారు. ఆర్టిజన్ల సమ్మె ప్రభావం విద్యుత్ సరఫరాలో లేదని, ఇప్పటి వరకు జెన్‌కోలో వందశాతం ఆర్టిజన్లు హాజరు అయ్యారని దేవులపల్లి ప్రభాకర్ రావు తెలిపారు.
విద్యుత్ సంస్థలలో ఏప్రిల్ 15 వ తేదీన పలు కార్మిక సంఘాలు ఆమోదం తెలిపిన వేతన సవరణ సరిపోలేదన్న సాకుతో కొందరు ఆర్టిజన్లు 25 ఏప్రిల్ నుండి ఇచ్చిన సమ్మె పిలుపు నేపథ్యంలో క్షేత్ర స్థాయి విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ పరిస్థితులను మంగళవారం నాడు విద్యుత్ సౌధలో ఉన్నతాధికారుల సమక్షంలో సమీక్షించడం జరిగిందన్నారు. సమ్మె ప్రభావం విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీల మీద లేదని, రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు అందించే విద్యుత్తులో అంతరాయాలు లేవని నివేదికలు అందాయన్నారు. జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్లు నూటికి నూరు శాతం, ట్రాన్స్ కో మరియు డిస్కమ్ లలో పనిచేస్తున్న ఆర్టిజన్లు నూటికి ఎనభై శాతం విధులకు హాజరైనట్టు తెలిపారు.
సమ్మె నుండి ఇతేహాద్ యూనియన్ వెనక్కి..
ఆర్టిజన్ల సమ్మెకు దూరంగా ఉండాలని కోరుతూ ఇతేహాద్ యూనియన్ లేఖ రాసింది. ఈ మేరకు ఆ సంఘం జనరల్ సెక్రటరీ నరేందర్ పేరిట లేఖ మీడియాకు విడుదల చేశారు. ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసి, ఇతేహాద్ యూనియన్ గౌరవాధ్యక్షులు, ఎంఎల్‌ఏ మహ్మద్ బలాల నేతృత్వంలో ఒక సమావేశం జరిగిందని, సమ్మె డిమాండ్ల అంశాన్ని విద్యుత్ శాఖ సిఎండిలు దేవులపల్లి ప్రభాకర రావు, రఘమారెడ్డిలతో సంయుక్త సమావేశంలో పాల్గొని మీ సమస్యలపై చర్చించారన్నారు. ఈ నేపథ్యంలో సమ్మెలో పాల్గొన కుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నట్లు తెలిపారు.