Thursday, January 23, 2025

ఆరవ జ్యోతిర్లింగంపై అస్సాం, మహారాష్ట్ర మధ్య వివాదం

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: ఆరవ జ్యోతిర్లింగం తమ రాష్ట్రంలోనే ఉందంటూ అస్సాం ప్రభుత్వం చేసిన ప్రకటనపై మహారాష్ట్ర కారాలు మిరియాలు నూరుతోంది. హిందువులు శివుడిని మూర్తి రూపంతోపాటు లింగరూపంలోను పూజిస్తారు. అయితే మూర్తి రూపంకన్నా లింగ రూపమే ప్రధానమైనదిగా విశ్వసిస్తారు. లింగంలో యోతి స్వరూపం వెలుగుతుంటుందని భక్తుల నమ్మకం. మొత్తం 64 జ్యోతిర్లింగాలు ఉన్నాయని శైవులు విశ్వసిస్తారు. కాగా ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే 12 లింగాలు పరమ పవిత్రమైనవిగా భావిస్తారు. వివిధ ప్రదేశాలలో వెలసిన ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒక్కో పేరుతో పిలుచుకుంటారు. ఇవన్నీ మహాశివుని భిన్న రూపాలుగా భక్తులు విశ్వసిస్తారు. 12 జ్యోతిర్లింగాల పేర్లు ఈ ప్రకారం మల్లికార్జునుడు(శ్రీశైల క్షేత్రం), సోమనాథ్(గిర్, గుజరాత్), మహాకాళేశ్వర్(ఉజ్జయిన్, యుపి),ఓంకారేశ్వర్(మధ్యప్రదేశ్), కేదార్‌నాథ్(ఉత్తరాఖండ్), భీమశంకరం(పుణె, మహారాష్ట్ర), కాశీ విశ్వనాథుడు(వారణాసి, యుపి), త్రయంబకేశ్వర్(నాసిక్, మహారాష్ట్ర), బైద్యనాథ్(దేవ్‌ఘర్, జార్ఖండ్), నాగేశ్వర(వ్వారక, గుజరాత్), ఉన్నాయి: రామనాథస్వామి(రామేశ్వరం), ఘృష్ణేశ్వర్(ఔరంగాబాద్, మహారాష్ట్ర).

కాగా..అనేక జాతీయ దినపత్రికల్లో దర్శనమిచ్చిన ఫుల్ పేజ్ ప్రకటనలు తాజా వివాదానికి కారణమయ్యాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా గువాహటిలోని పమోహి వద్ద డాకిని పర్వతాలపై వెలసిన భీమశంకర జ్యోతిర్లింగాన్ని భక్తులు సందర్శించాలని ఆహ్వానిస్తూ అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ అన్ని జాతీయ పత్రికల్లో ఫుల్ పేజ్ ప్రకటనలు జారీచేశారు. మహారాష్ట్రలోని కొన్ని వార్తాపత్రికల్లో సైతం ఈ ప్రకటనలు కనిపించాయి. వీటిని చూసిన కొందరు రాజకీయ నాయకులు గందరగోళానికి లోనుకాగా మరికొందరైతే తీవ్ర అసహనానికి గురయ్యారు.

ప్రాచీన గ్రంధాల ప్రకారం మహారాష్ట్రలోని పుణెలో వెలసిన జ్యోతిర్లింగమని ఆలయ ట్రస్టీ, ప్రధాన పూజారి మధుకర్ గవండే ఒక టివి చానల్‌కు స్పష్టం చేశారు. అస్సాం ముఖ్యమంత్రి జారీచేసిన ప్రకటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి డిమాండు చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయం పట్ల ప్రత్యేక ప్రేమ ఉందని, దీనిపై ఇప్పుడు ఆయన ఏం జవాబిస్తారో చూస్తామని శివసేన అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

భీమేశ్వర ఆలయం భీమా నది ఒడ్డున ఉందని, భీమా నది పుణెలో ఉందని ఎన్‌సిపికి చెందిన ఎంపి అమోల్ కల్హే అన్నారు. మహారాష్ట్రలోని పరిశ్రమలను లాక్కుంటున్న బిజెపి ఇప్పుడు మహారాష్ట్రలోని ఆధ్యాత్మిక సంపదను కూడా కొల్లకొట్టేందుకు నిర్ణయించుకుందని మరో ఎన్‌సిపి ఎంపి సుప్రియా సూలె విమర్శించారు. పరిశ్రమలనే కాక మహారాష్ట్ర నుంచి మహాశివుడిని కూడా చేజిక్కించుకోవాలని బిజెపి భావిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్ విమర్శించారు. ఆరవ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పుణెలో కాక అస్సాంలో ఉందని అస్సాం ప్రభుత్వం ప్రకటిస్తోందని, ఈ అసంబద్ధ వాదనను తాము పూర్తిగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే బిజెపి మాత్రం ప్రతిపక్షాలదే తప్పంతాగా చిత్రీకరిస్తోంది. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని బిజెపి అధికార ప్రతినిధి, ఎంఎల్‌ఎ రాం కదమ్ ఆరోపించారు. మహారాష్ట్రలో జ్యోతిర్లింగాలు త్రయంబకేశ్వర్, భీమశంకర్, పర్లి వైజనాథ్, ఘృష్ణశ్వర్, నాగనాథ్‌లోని ఉన్నాయని ఒక ప్రభుత్వ ఉత్తర్వును ఉటంకిస్తూ ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News