Friday, November 22, 2024

న్యాయమూర్తుల మధ్య పేచీ

- Advertisement -
- Advertisement -

న్యాయమూర్తులు పరస్పర వ్యక్తిగత వ్యతిరేక దృష్టితో తీర్పులు ఇచ్చారనే అభిప్రాయానికి తావిచ్చి వివాదాస్పదులు కావడం అరుదైన విషయం. ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు వారి మధ్య న్యాయం బలి కాకుండా చూసుకోవలసి ఉంది. కలకత్తా హైకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తుల మధ్య ఒక కేసులో ఇప్పుడు చోటు చేసుకొన్న వివాదంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవలసి వచ్చింది. వీరిలో ఒకరు ఏక న్యాయమూర్తి ధర్మాసనానికి చెందినవారు కాగా, మరొకరు డివిజన్ బెంచ్‌లోని వారు. కింది ధర్మాసనం ఇచ్చిన తీర్పును పై బెంచ్ కొట్టివేయడమో లేక దానిపై స్టే ఇవ్వడమో మామూలుగా జరిగేదే. కాని సాటి న్యాయమూర్తి పాలక రాజకీయ పార్టీకి మేలు చేయడానికి పని చేస్తున్నారని మరో న్యాయమూర్తి వ్యాఖ్యానించడమే ఇందులోని విపరీతాంశం. పశ్చిమ బెంగాల్‌లోని వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం గిరిజనులంటూ నకిలీ కులధ్రువీకరణ పత్రాలను విరివిగా ఇస్తున్నారని కలకత్తా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. చాలా మంది ఈ సర్టిఫికేట్‌లను తీసుకొంటున్నారని అందు లో ఆరోపించారు.

ఈ నెల 24 ఉదయం ఈ కేసును విచారణకు తీసుకొన్న న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ రాష్ట్ర పోలీసులనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. అదే సమయంలో సిబిఐ దర్యాప్తుకి ఆదేశించారు. దీని మీద పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జస్టిస్ సౌమెన్ సేన్ అధ్యక్షతన గల డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించింది. సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన సింగిల్ జడ్జి తీర్పుపై జస్టిస్ సేన్ స్టే ఉత్తర్వులు జారీ చేశారు. దానితో సిబిఐ దర్యాప్తు చేపట్టాల్సిందేనని జస్టిస్ గంగోపాధ్యాయ ఆదేశించారు. జస్టిస్ సేన్ రాష్ట్రాన్ని పాలిస్తున్న రాజకీయ పార్టీని(తృణమూల్ కాంగ్రెస్) కాపాడాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన అక్రమంగా వ్యవహరిస్తున్నారని నిందించారు. తాను ఇచ్చిన సిబిఐ ఉత్తర్వుల ప్రతిని భారత ప్రధాన న్యాయమూర్తికి, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు. డివిజన్ బెంచ్ స్టే పై సింగిల్ జడ్జి జోక్యం చేసుకొని తన ఆదేశాలే చెల్లాలని తాజా ఉత్తర్వులు జారీ చేయడం అరుదైన పరిణామం. అంతేకాకుండా డివిజన్ బెంచ్ న్యాయమూర్తిపై రాజకీయ పక్షపాత ఆరోపణలు చేయడం ప్రత్యేకించి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

జస్టిస్ సేన్ సొంత ప్రయోజనాల కోసం పాలక పక్షానికి మేలు చేయదలిచారని, తాను చెప్పినట్టు నడుచుకోవాలని డివిజన్ బెంచ్‌లోని మరో న్యాయమూర్తిని బెదిరించారని కూడా జస్టిస్ గంగోపాధ్యాయ ఆరోపించడం గమనార్హం. దీని వెనుక వ్యక్తిగత కక్ష ఏమైనా ఉందా అనే అనుమానం కలగడం సహజం. అయినా న్యాయ వ్యవస్థలో గల అంచెల ఏర్పాటులో పై ధర్మాసనాలకు, సుప్రీం కోర్టుకి కూడా వెళ్లే అవకాశాలున్నాయి. అందుచేత జస్టిస్ గంగోపాధ్యాయ ఇంతగా నిగ్రహం కోల్పోవడం అవసరమా? ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు పాలకుల ప్రయోజనాలకు అనువుగా తీర్పులు చెప్పడం అరుదుగానైనా జరుగుతున్నదా అనే అనుమానమూ కలుగుతున్నది. గతంలో ఒకసారి అక్రమ కట్టడాల కూల్చివేతలకు సంబంధించిన కేసులో కలకత్తా నగరమంతా అక్రమ నిర్మాణాలు వెలిశాయని, అవసరమనుకుంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నుంచి అద్దెకు బుల్డోజర్లు తెచ్చుకోండి అని అక్కడి మునిసిపల్ అధికారులను ఉద్దేశించి గంగోపాధ్యాయ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

ఆయన సరదాకే అలా వ్యాఖ్యానించారని గంగోపాధ్యాయ తరపున వివరణ వచ్చినప్పటికీ అది రాజకీయ వర్గాల్లో తీవ్రమైన సంచలనం సృష్టించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుత కేసులో జస్టిస్ సేన్‌పై జస్టిస్ గంగోపాధ్యాయ చేసిన వ్యాఖ్యలను గమనంలోకి తీసుకొన్న సిజెఐ తన సారథ్యంలోనే ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఈ ఉదంతాన్ని ప్రత్యేక విచారణకు స్వీకరించారు.రెండు బెంచీలు ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేశారు. ఈ ధర్మాసనం విచారణను 29 తేదీ సోమవారం నాటికి వాయిదా వేసింది. సిబిఐకి నోటీసు జారీ చేసింది. దీనిపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ స్పందనకు ఆదేశించింది. కేసులోని అసలు పిటిషనర్‌ను కూడా హాజరు కమ్మంది. న్యాయ వ్యవస్థ పరువును బలి తీసుకొన్న ఇటువంటి ఘటనలు తిరిగి తలెత్తకుండా సరైన అంతర్గత వ్యవస్థను ఏర్పాటు చేస్తారేమో చూడాలి. ముఖ్యంగా న్యాయ వ్యవస్థను పాలకులు అదుపు చేసే అవకాశానికి ఎటువంటి సందు లేకుండా చూడవలసి ఉంది.

న్యాయమూర్తులు రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ పదవులు పొందడం వంటి పద్ధతులను పూర్తిగా అరికట్టాలి. గతంలో సిజెఐగా పని చేసిన ఒక సీనియర్ న్యాయమూర్తిని ఆయన రిటైర్ అయిన తర్వాత రాజ్యసభ సభ్యత్వం వరించిన సంగతి తెలిసిందే. అందుచేత న్యాయ వ్యవస్థకు గల ఏ చిన్న కంతనైనా పూడ్చిపెట్టాల్సిందే. ఇది ఒక్క పశ్చిమ బెంగాల్‌కు మాత్రమే పరిమితమైన వ్యవహారం కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News