Tuesday, December 24, 2024

రాహుల్‌పై ‘అనర్హత వేటు’!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో రెండేళ్ల శిక్ష పడిన కాంగ్రెస్‌ఎంపి రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. లోక్‌సభనుంచి డిస్‌క్వాలిఫై చేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం ప్రకటించింది. సూరత్ కోర్టు తీర్పు వెలువడిన రోజు (మార్చి 23)నుంచే అనర్హత వేటు అమలులోకి వస్తుందని లోక్‌సభ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో తెలియజేసింది. లోక్‌సభ సెక్రటేరియట్ చర్యను ఆయన గొంతును నొక్కే ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తూ .. దీనిపై చట్టప్రకారంగా, రాజకీయంగా పోరాడుతామ ని స్పష్టం చేసింది. కాగా ఈ ఆరోపణలను బిజెపి తోసిపుచ్చుతూ అనర్హత వేటు చట్టబద్ధమైనదని పేర్కొంది. పరువునష్టం కేసులో సూరత్ కోర్టు తీర్పు ఇచ్చిన మరుసటి రోజే ఆ తీర్పు కాపీని పరిశీలించిన లోక్‌సభ సెక్రటేరియట్ చర్యలు చేపట్టింది.

‘ దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరు ఎందుకుంటుందో?’ అంటూ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్నాటకలోని కోలార్‌లో రాహుల్ వ్యాఖ్యానించారంటూ గుజరాత్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఎ పూర్ణేష్ మోడీ సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత గురువారం న్యాయస్థానం రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. రాహుల్ అభ్యర్థన మేరకు ఈ కేసులో వ్యక్తిగత పూచీకత్తుపై బెయిలు మంజూరు చేసిన కోర్టు.. ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు దాఖలు చేసేందుకు 30 రోజుల సమయం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏదైనా కేసులో నిందితులు దోషులుగా తేలిన తర్వాత జైలు శిక్ష పడిన వారికి ప్రజా ప్రతినిధిగా కొనసాగే అవకాశం ఉండదంటూ ప్రజాప్రాతినిధ్య చట్టంలో చేసిన సవరణకు అనుగుణంగా లోక్‌సభ సెక్రటేరియట్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు అంతకన్నా ఎక్కువ శిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన రోజునుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండడానికి అర్హత కోల్పోతారు. జైలుశిక్షా కాలంతో పాటుగా మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అనర్హులవుతారు. ప్రజాప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని 2013లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గంనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం దోషిగా తేలిన తేదీ(23 మార్చి, 2023)నుంచి అనర్హుడైనట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. భారత రాజ్యాంగంలోని ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారీ స్పందించారు.లోక్‌సభ సెక్రటేరియట్ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు.‘ లోక్‌సభ సచివాలయం ఒక ఎంపిపై అనర్హత వేటు వేయరాదు. రాష్ట్రపతి ఎన్నికల కమిషన్‌తో చర్చించిన తర్వాత మాత్రమే చేయాల్సి ఉంటుంది ’అని ఆయన పేర్కొన్నారు. కాగా పై కోర్టులో ఊరట లభించని పక్షంలో రాహుల్ గాంధీ తన అధికార నివాసాన్ని నెల రోజుల్లో ఖాళీ చేయాల్సి ఉంటుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

పోరాటం కొనసాగుతుంది: కాంగ్రెస్

రాహుల్ గాంధీ అనర్హతపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ఇది భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజని వ్యాఖ్యానించింది. దీనిపై న్యాయపరంగా, రాజకీయంగా పోరాటం చేస్తామని స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ నిజం మాట్లాడుతున్నందునే, రాజ్యాంగం కోసం, ప్రజల తరఫున పోరాటం చేస్తున్నందుకే ఆయనను సభనుంచి తొలగిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. రాహుల్ గాంధీని లోక్‌సభనుంచి బైటికి పంపించి వేస్తే తమ సమస్య పరిష్కారమవుతుందని బిజెపి అనుకొంటోందని, అయితే అది నిజం కాదని, ఎందుకంటే అదానీ వ్యవహారంపై జెపిసి వేయాలన్న డిమాండ్‌ను లేవనేత్తుతూనే ఉంటామని ఖర్గే స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి తాము పోరాడుతూనే ఉంటామని, ఒక వేళ జైలుకు వెళ్లాల్సివచ్చినా వెళ్తామని, తమ కార్యకర్తలు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

కాగా తాము న్యాయపరంగా, రాజకీయంగా పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఒక ట్వీట్‌లో స్పష్టం చేశారు. తమను ఎవరూ భయపెట్టలేరని, తమ గొంతు నొక్కలేరని ఆయన అన్నారు. ‘ప్రధానితో ముడిపడిన అదానీ మహా మెగా కుంభకోణంపై జెపిసి వేయడానికి బదులు రాహుల్ గాంధీపై అనర్హతవేటు వేశారు. ఇండియన్ డెమోక్రసీ ఓం శాంతి’ అని జై రాం రమేశ్ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు నియంతృత్వానికి మరో ఉదాహరణ. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కూడా బిజెపి ఇదే పద్ధతిని అవలంబించి.. దాని పర్యవసనాలను ఎదుర్కోవలసి వచ్చింది. దాన్ని ఆ పార్టీ మరువరాదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ అన్నారు. కాగా రాహుల్ గాంధీపై చర్యను కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి ఎస్‌పిఎస్ బఘేల్ గట్టిగా సమర్థిస్తూ, చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు. ఈ నిర్ణయం చట్టపరమైనదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ అంటూ కాంగ్రెస్ పార్టీ న్యాయవ్యవస్థను ప్రశ్నిస్తోందని విమర్శించారు.

పార్లమెంటుకు హాజరైన రాహుల్

కాగా తనను అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ముందు రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలకు హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనపై అనర్హత వేటు పడవచ్చంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రాహుల్ పార్లమెంటుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన కాంగ్రెస్ ఎంపిల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం లోక్‌సభ ప్రారంభం కాగానే ఆ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News