కోహిమా : నాగాలాండ్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) ఎంఎల్‌ఎలు ఏడుగురిపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్ షరింగైన్ లాంగ్‌కుమర్ కొట్టివేశారు. ఆ ఏడుగురు ఎంఎల్‌ఎలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారని ఆరోపిస్తూ శరద్ పవార్ సారథ్యంలోని ఎన్‌సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి హేమంత్ తక్లె వారిపై అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఏడుగురు ఎన్‌సిపి ఎంఎల్‌ఎలు అజిత్ పవార్ నాయకత్వంలోని వర్గానికి అనుకూలంగా మద్దతు లేఖ అందజేశారు.
ఎన్నికల చిహ్నాల ఉత్తర్వునకు సంబంధించిన వివాదంపై ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం తీసుకునే వరకు అనర్హత పిటిషన్‌పై తీర్పు ఏదీ ఇవ్వవద్దని అభ్యర్థిస్తూ అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్‌సిపి నుంచి నిరుడు ఆగస్టు 30న ఒక లేఖ కూడా స్పీకర్‌కు అందింది. స్పీకర్ లాంగ్‌కుమర్ శుక్రవారం తీర్పు వెలువరిస్తూ, ఎన్‌సిపికి సంబంధించిని అనర్హత పిటిషన్ తన కోర్టులో ఐదు నెలలపైగా పెండింగ్‌లో ఉందని తెలిపారు.