ఏడుగురు శాసనసభ్యులపై రిట్ పిటిషన్, మరో ముగ్గురిపై
సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పి దాఖలు చేసిన బిఆర్‌ఎస్
మన తెలంగాణ/హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులపై బిఆర్‌ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు వే యాలని పిటిషన్ దాఖలు చేసింది. గురువారం ఢిల్లీ లోని న్యాయవాద బృందంతో ఈ అంశంపై చర్చించిన మాజీ మంత్రి, ఎమ్యెల్యే హరీష్ రా వు పార్టీ తరఫున పిటిషన్లు దాఖలు దాఖలు చేశారు. ఏడుగురు ఎంఎల్‌ఎల అనర్హతపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్, కృష్ణమోహన్, మహిపాల్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, గాంధీపై రిట్ పిటిషన్ వేసిన బిఆర్‌ఎస్ దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తరుఫున గెలిచిన 10 మంది ఎమ్యెల్యేలు ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు.
వీరిని అనర్హులుగా ప్రకటించాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు పాడి కౌశిక్ రెడ్డి, కెపి వివేకానంద హైకోర్టును ఆశ్రయించగా, ఈ అంశంపై చర్య తీసుకోవాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించింది. హైకోర్ట్ సింగిల్ జడ్జి తీర్పుపై శాసనసభ సెక్రెటరీ హైకోర్టు ప్రత్యేక బెంచ్‌ని ఆశ్రయించారు. పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎలపై ఎప్పుడైనా చర్య తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంటుందని, అయితే దీనికి టైమ్ బౌండ్ ఏమీ లేదని ప్రత్యేక బెంచ్ తన తీర్పు లో స్పష్టం చేసింది. అయినప్పటికీ స్పీకర్ ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ బిఆర్‌ఎస్ పార్టీ తాజాగా సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను ఆరు నెలలు గడిచినా స్పీకర్ చర్య తీసుకోలేదని, కనీసం వారికి నోటీసు కూడా ఇవ్వలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్‌ఎస్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.