Friday, November 22, 2024

అమెరికాలో విమానాలకు బ్రేక్‌లు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికాలో అసాధారణ రీతిలో బుధవారం పూర్తి స్థాయిలో విమాన రాకపోకలలో అంతరాయం ఏర్పడింది. దేశీయంగా నడిచే అంతర్గత విమాన సర్వీసులన్నింటిని నిలిపివేయాల్సి వచ్చిందని ఎన్‌బిసి న్యూస్ తెలిపింది. విమానయాన సంబంధిత కంప్యూటర్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపాలతో ఈ అరుదైన పరిణామం చోటుచేసుకుందని అధికార వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వెలువడ్డాయి. విమాన రాకపోకలకు సంబంధించిన ఫ్లైట్‌అవేర్ వెబ్‌సైట్ అందించిన సమాచారం ప్రకారం 400కు పైగా విమానాల రాకపోకలు నిలిచిపొయ్యాయి. ఇందులో అత్యధికం దేశంలో అంతర్గత ప్రయాణాలకు ఉద్ధేశించినవి కాగా మరికొన్ని విదేశాలకు వెళ్లేవి కూడా ఉన్నాయి. సిస్టమ్ దెబ్బతిందని, ఇది ఎప్పటికి తిరిగి పనిచేస్తుందనేది చెప్పలేమని యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఫా) ఓ ప్రకటన వెలువరించింది.

ఓ వైపు మంచుతుఫాన్లతో చాలా రోజులుగా నిలిచిన ప్రయాణాలకు తోడుగా ఇప్పుడు సాంకేతిక లోపాలతో విమానాలకు బ్రేక్‌లు పడటంతో వేలాది మంది ప్రయాణికులు ఉసూరుమంటున్నారు. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలలో ప్రయాణికులు నానా అగచాట్లకు గురవుతున్నారు. సంబంధిత సాంకేతిక వైఫల్యం గురించి పౌర విమానయాన నియంత్రణ సంస్థ ఫా వెంటనే విమాన ప్రయాణాలకు సంబంధించి తక్షణ నోటీసు (నోటమ్) వెలువరించింది. హవాయి నుంచి వాషింగ్టన్ వరకూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో విమాన ప్రయాణాలు నిలిచిపోయిన విషయాన్ని ప్రయాణికులు సామాజిక మాధ్యమాలలో వెలువరించారు. ఎయిర్‌పోర్టుల్లో వేచి ఉన్నప్పటి ఫోటోలను పొందుపర్చారు. టెక్సాస్ మొదలుకుని పెన్‌సిల్వేనియా వరకూ ఎయిర్‌పోర్టులలో గందరగోళ పరిస్థితులు ఉన్న విషయం నిర్థారణ అయింది.

దేశంలో ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి దిగ్భ్రాంతికర పరిస్థితి ఏర్పడలేదని వైమానిక నిపుణులు పర్వేజ్ డమానియా తెలిపారు. దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలు నిలిచిపోయిన ఉదంతం బహూశా 9/11 దాడుల దశలో నెలకొని ఉంటుందని, ఇప్పటి పరిణామం నమ్మశక్యం కాని విఘాతంగా మారుతోందని వ్యాఖ్యానించారు. దాదాపు 400 వరకూ విమానాల రాకపోకలు నిలిచిపోగా , దాదాపు 760 వరకూ విమానాల ప్రయాణాలలో తీవ్ర జాప్యం ఏర్పడింది. ప్రస్తుత దశలో పైలెట్లు ప్రమాదకర పరిణామాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎయిర్‌పోర్టు అనుసంధాన సేవలు, సంబంధిత పద్ధతులపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలని హెచ్చరికలు వెలువడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News