న్యూయార్క్ : 2019 లో ప్రారంభమైన సూర్యుని 11 ఏళ్ల కార్యాచరణ చక్రంలో ముఖ్యమైన క్రియాశీల కాలంలోకి సూర్యుడు ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. దీని ప్రభావం వారాంతంలో భూమిపై ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. గతనెల సూర్యుడు నుంచి అత్యంత శక్తివంతమైన సౌర జ్వాల వెలువడింది. ఇది అయిదేళ్లపాటు ప్రభావం చూపిస్తుంది. సౌర జ్వాలలు, సూర్యవలయ ( కరోనల్ మాస్) ఉత్పాదకాలు చాలా శక్తివంతమైన పేలుళ్లకు దారి తీస్తాయని, అవి నేరుగా భూమిపైపు వ్యాపించి మరిన్ని విస్ఫోటనాలు కలిగిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనల్ మాస్ ఉత్పాదకాలంటే సూర్యుని నుంచి వెలువడే ప్లాస్మా తాలూకు పెద్దపెద్ద మేఘాలతో కూడిన అయస్కాంత క్షేత్రాలు. ఇవి ఏ దిశలోనైనా సౌరవాయువుల ద్వారా వ్యాపిస్తుంటాయి. గత నెల వెలువడిన సౌర జ్వాల సౌరచక్రంలో బలమైనదే అయినప్పటికీ భూమికి నేరుగా ఎలాంటి నష్టం కలగదని , మన శాటిలైట్లకు కానీ, పవర్ గ్రిడ్లకు కానీ ఎలాంటి హాని కలిగించదని చెబుతున్నారు. కానీ ఒకవేళ అనూహ్యంగా సూర్యుని కార్యాచరణ పెరిగితే సౌర వాతావరణమే పూర్తిగా ప్రమాదకరంగా మారుతుందని, దానివల్ల విద్యుత్ గ్రిడ్లు, శాటిలైట్లు, బాగా దెబ్బతింటాయని హెచ్చరించారు.
అంతేకాదు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములకు, అక్కడి పరికరాలకు హాని జరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతరిక్ష వాతావరణ నిపుణుల తాజా అంచనాల ప్రకారం సూర్యవలయం ( కరోనా మాస్) నుంచి వెలువడే తాజా వెల్లువలు సౌర జ్వాల కన్నా కాస్త విభిన్నంగా ఉంటాయని, అవి మే7 న సూర్యుని నుంచి ఆవిర్భవించాయని చెప్పారు. ఇవి భూమిపైని అయస్కాంత క్షేత్రాన్ని దెబ్బతీస్తాయని, దాని ప్రభావం మే 10 న కనిపించవచ్చని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెయిరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఒఎఎ)కు చెందిన విశ్లేషకులు వివరించారు. వీటి ప్రభావంతో స్వల్పంగా భూ అయస్కాంత తుపాన్లు చెలరేగవచ్చని అంచనాగా చెప్పారు.