Friday, November 22, 2024

మొక్కుబడిగా మద్దతు

- Advertisement -
- Advertisement -

Dissatisfaction prevails in farmers' unions over MSP prices

పంటలకు మొక్కుబడిగా మద్ధతు ధరలు పెంచిన కేంద్రం
వరికి రూ.100 పెంపుతో క్వింటాలు ధర రూ.2060
కందికి రూ.300 ..పెసర్లకు రూ.400 పెంపుదల
రూ. 6380కి చేరిన పత్తి ధర..మార్కెట్ ధర 12500
వానాకాలం సాగుకు ముందే రైతులను నీరుగార్చిన మోడి సర్కారు
రైతుసంఘాల్లో అసంతృప్తి వెల్లువ

మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ రంగాన్ని లాభాసాటిగా మార్చి రైతుల ఆదాయాన్ని 2020నాటికి రెట్టింపు చేస్తామని చెప్పిన ప్రధాని నరేంద్రమోడి సర్కారు పంటల మద్దతు ధరలను మొక్కుబడిగా పెంచి రైతుల కన్నీటిని తుడిచే ప్రయత్నం చేసింది. 2022-23కు సంబంధించి వివిధ రకాల వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరలను పెంచుతూ బుధవారం పెంచిన ధరలను ప్రకటించింది. వరికి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.100పెంచింది. ఈ పెంపుదలతో ఖరీఫ్‌లో వరి మద్దతు ధర రూ.1940నుంచి రూ.2040కి పెరిగింది. అదే విధంగా ఏ గ్రేడ్ వరి మద్దతు ధరను రూ.1960నుంచి రూ. 2060కి పెంచింది. పత్తి క్వింటాలుకు కనీస మద్ధతు ధర రూ.5726నుంచి రూ.6080కి పెంచింది. పొడవు పింజ రకం పత్తి రూ.6025నుంచి రూ.6380కి పెంచింది.

కందులపైన క్వింటాలుకు కనీస మద్ధతు ధర రూ.300 పెంచింది. దీంతో క్వింటాలు ధర రూ.6600కి చేరుకుంది. అదే విధంగా పెసర్లకు ధరను రూ.400 పెంచటంతో వీటి ధర రూ.7755కు చేరుకుంది. మినుముల ధరను రూ.6600కు, వేరుశనగ ధరను రూ.5850కి పెంచింది. నువ్వుల ధర క్వింటాలుకు రూ. 523 పెంచింది. పొద్దుతిరుగుడు ధర రూ.385కు, సోయాబీన్ ధర రూ.300 పెంచింది. జొన్నలు సాధారణ రకం క్వింటాలు రూ.2970, ఏ గ్రేడ్ రకం రూ.2990కి పెంచింది. సజ్జలు క్వింటాలు రూ. 2550, రాగులు రూ3578, మొక్కజొన్న క్వింటాలు రూ.1962కు పెంచింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడి అధ్యక్షతన జరిగిన ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటి పెంచిన మద్ధతు ధరల నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే ధరలు పెంచడం వల్ల రైతులు ఏ పంటవేయాలో నిర్ణయించుకునే అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

పెరిగిన సాగు ఖర్చులతో రైతు గిలగిల

వ్యవసాయరంగంలో సాగు ఖర్చులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. పంటల సాగు గిట్టుబాటు కాక ఏటా పదిశాతం పైగా రైతులు వ్యవసాయం వదిలి ఇతర వృత్తుల్లోకి వెళ్లుతున్నారు. కొత్తగా ఈ రంగంలోకి యువత కన్నెత్తి చూసే పరిస్థితి కనుచూపుమేరలో కనిపించటం లేదు. వ్యవసాయాన్ని గిట్టుబాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగం నిపుణులు డా.స్వామినాధన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమీషన్ ఈరంగంలో సమగ్ర అధ్యయనం జరిపి కేంద్రానికి నిదేదిక సమర్పించింది. బీజేపిని అధికారంలోకి తెస్తే స్వామినాధన్ నివేదికను యథాతధంగా ఆమలు పరుస్తామని వెంకన్న సాక్షిగా తిరుపతి సభలో ప్రకటించిన నరేంద్రమోడి అధికారంలోకి రాగానే నివేదిక అమలును పూర్తిగా అటెకెక్కించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2020నాటికి రైతుల ఆదాయం రెట్టిపు చేస్తామన్న హమీలను కూడా నిలబెట్టుకోలేదంటున్నారు. పంటసాగులో డీజిల్ ధరలు పెరిగాయి. ట్రాక్టర్ సేద్యం ఖర్చులు రెట్టింపయ్యాయి. కూలీ రేట్లు పెరిగాయి. క్రిమి సంహారక మందులు ధరలు పెరిగిపోయాయి. వరి , పత్తి తదితర విత్తనాల ధరలు కూడా పెరిగిపోయాయి.

రసాయనిక ఎరవుల ధరలు 40శాతం పెంచి కూర్చున్న కేంద్రం పంటలకు మద్దతు ధరల విషయంలో మాత్రం కంటితుడుపు పెంపుదలతో సరిపెట్టిందని రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రైతుల ఆదాయాన్ని రూ.21146కు పెంచాలని రైతు అదాయ రెట్టింపు కమిటి నివేదిక ఇచ్చింది. కాని ఇది రూ.13000 దాటటం లేదని తెల్చింది. దేశంలో రైతుల సగటు ఆదాయం రూ.6000లోపే ఉందని రెండేళ్లకిందటే నీతిఆయోగ్ వెల్లడించింది. ఇన్ని నివేదికలు రైతుల ఆదాయం జీవన పరిస్థితులకు అద్దం పడుతున్నా కేంద్రం మాత్రం సరైన రీతిలో స్పందించటం లేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ రకాల పంటల కనీస మద్దతు ధరలు రైతులను మరింత నష్టాల్లోకి నెట్టేసేలా ఉన్నాయని రైతులు , రైతు సంఘాల నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News