ఫిబ్రవరి 4న అడ్‌హక్ బోర్డు ఎన్నికలు
నోటీస్ జారీ చేసిన సహకార శాఖ
అడ్‌హక్ కమిటీ ఎంపిక పట్ల జెఎన్‌జె కమిటీ హర్షం
మన తెలంగాణ/హైదరాబాద్: జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌజింగ్ సోసైటీ డైరెక్టర్ పోస్టులకు ఎన్నికలు నిర్వహించేందుకు అడ్‌హక్ బోర్డును ఏర్పాటు చేయాలని సహకార శాఖ నిర్ణయించింది. జిల్లా సహకార అధికారి డి.రమాదేవి శనివారం నోటీసు జారీ చేశారు. డిఫ్యూటీ రిజిస్ట్రార్ వెంకట్‌రెడ్డితో కలిసి నిజాంపేట్‌లోని జెఎన్‌జె కార్యాలయానికి వెళ్లి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 11.30 గంటలకు నిజాంపేట్‌లోని జెఎన్‌జె స్థలంలోనే సర్వసభ్య సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అడ్‌హక్ బోర్డును ఏర్పాటు చేస్తామని ఆమె వివరించారు. ఈ సమావేశానికి సహకార శాఖ డిఫ్యూటీ రిజిస్ట్రార్ సికింద్రాబాద్‌ను కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
ఈ బోర్డు జేఎన్‌జే మ్యాక్ హౌజింగ్ సోసైటీకి 5 డైరెక్టర్ పోస్టులకు ఎన్నికలు నిర్వహిస్తుంది. నెలరోజుల్లోగా ఎన్నిక ప్రక్రియను ఈ బోర్డు పూర్తి చేయాల్సి ఉంటుంది. జెఎన్‌జె స్వయం ప్రకటిత కమిటీని రద్దు చేసుకుని తన వద్దకు వస్తే పేట్‌బషీరాబాద్ లోని 38 ఎకరాల భూమి స్వాధీనం చేస్తానని సిఎం. రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించారు. టీం జెఎన్‌జె ఈ మేరకు పోరాటం చేసి విజయం సాధించింది. 21 డిసెంబర్ 2023 న రవీంద్రభారతిలో జరిగిన సమావేశం స్ఫూర్తి ఎన్నికలకు దోహదం చేసింది.
సిఎంకు టీమ్ జెఎన్‌జె కృతజ్ఞతలు:
ఎంతోకాలంగా జెఎన్‌జె హౌజింగ్ సోసైటీకి నూతన కమిటీని ఏర్పాటు చేయాలని చేసిన పోరాటానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల సిఎం రేవంత్‌రెడ్డికి టీమ్ జెఎన్‌జె కృతజ్ఞతలు తెలిపింది. గత కొన్నేళ్లుగా స్వయం ప్రకటిత కమిటీని రద్దు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన 70 ఎకరాల ఇళ్ల స్థలాలను అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నోసార్లు కలిసి విన్నవించింది. జెఎన్‌జె పోరాట ఫలితంగా స్వయం ప్రకటిత సోసైటీ మేనేజింగ్ కమిటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల సభ్యలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా అడ్‌హక్ బోర్డును ఎన్నికల ద్వారా ఎంపిక చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జెఎన్‌జె వ్యవస్థాపక సభ్యులు పి.వి.రమణారావు సంతోషం వ్యక్తం చేశారు. సభ్యులంతా ఫిబ్రవరి 4న జరిగే సర్వసభ్య సమావేశంలో తప్పనిసరిగా పాల్గొని బోర్డు ఎంపికకు సహకరించాలని కోరారు.