Friday, November 22, 2024

కేంద్ర మంత్రులతో ఓటర్లకు డబ్బు పంపిణీ

- Advertisement -
- Advertisement -

Distributing money to voters with Union Ministers: Mamatha

 

నందిగ్రామ్‌లో ‘బయటి’ పోలీసుల ఓవరాక్షన్
బెంగాల్ ముఖ్యమంత్రి మమత ఆరోపణలు

నందిగ్రామ్: తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడానికి బిజెపి పాలిత రాష్ట్రాలకు చెందిన పోలీసు దళాలను రప్పించారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. బిజెపికి చెందిన కేంద్ర మంత్రులు, భద్రతా దళాలు ఓటర్లను డబ్బుతో ప్రలోభ పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఎన్నికల ప్రచారం ముగింపు రోజు మంగళవారం నందిగ్రామ్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలలో వీల్ చెయిర్‌లో కూర్చునే ప్రచారం నిర్వహించిన మమతా బెనర్జీ సోనాచురాలో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ దేశనలుమూలల నుంచి తెప్పించిన డబ్బుతో ఇక్కడి హోటళ్లలో తిష్టవేసిన బిజెపి మంత్రులు బిజెపికి అనుకూలంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు పంచుతున్నారని ఆరోపించారు. అంతేగాక భద్రతా దళాలకు చెందిన వాహనాల నుంచి కూడా డబ్బు పంపిణీ జరుగుతోందని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు బిజెపి అన్ని నిబంధనలకు పాతరేసిందని ఆమో ఆరోపించారు.

కరోనాను ఎదుర్కొనే నిమిత్తం ప్రజల నుంచి విరాళాలు సేకరించేందుకు ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన పిఎం కేర్స్ ఫండ్‌కు చెందిన డబ్బు ఇది. పెద్ద నోట్ల రద్దు సందర్భంగా సంపాదించిన అక్రమ సొమ్ము ఇది. ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడం ద్వారా సంపాదించిన అక్రమ డబ్బు ఇది. ప్రజల నుంచి లూటీ చేసిన సొమ్మును ఇప్పుడు ఓటర్లకు రూ. 500, రూ. 1000 చొప్పున పంచిపెడుతున్నారు. ఈ అక్రమాల గురించి ఎన్నికల కమిషన్‌కు మేము ఫిర్యాదు చేసినప్పటికీ నిర్నిరోధంగా ఈ అక్రమ డబ్బు పంపిణీ కొనసాగుతూనే ఉంది అంటూ మమత ఆరోపణలు గుప్పించారు. బిజెపి పాలిత రాష్ట్రాలకు చెందిన మంత్రులు, కేంద్ర మంత్రులు ఈ డబ్బు పంపిణీ వెనుక ఉన్నారని ఆమె ఆరోపించారు.

ఎన్నికల ప్రచారంలో బిజెపి నాయకుల ఆర్భాటాలను ఆమె ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచార సందర్భంగా 5 వాహనాలకు మించి అనుమతించబోమని నిర్దేశించిన ఎన్నికల కమిషన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ర్యాలీకి మాత్రం వందకు పైగా వాహనాలను ఎలా అనుమతించిందని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నుంచి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని మమత ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ మళ్లీ బెంగాల్‌లో అధికారం చేపడుతుందని ఆమె జోస్యం చెప్పారు. బయట నుంచి వచ్చిన పోలీసు బలగాలు కొద్ది రోజుల్లో వెళ్లిపోతాయని, ఓటర్లు మాత్రం తప్పు చేయకూడదని ఆమె కోరారు. మళ్లీ తామే అధికారంలోకి వచ్చి నమ్మక ద్రోహులకు తగిన గుణపాఠం చెబుతామని ఆమె హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News