మన తెలంగాణ/ హైదరాబాద్ : దేశంలో ఎక్కడాలేనన్ని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు అయ్యారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. 57 ఏళ్లు నిండిన వారికి ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను సోమవారం సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్‌లో మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉమ్మడి రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులకు రూ. 200, వికలాంగులకు రూ.500 పెన్షన్ ఉండగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పేరుతో వృద్ధులు, వితంతువులకు రూ. 2016లు, వికలాంగులకు రూ. 3016లకు పెంచిందన్నారు.
అంతేకాకుండ 65 ఏళ్లుగా ఉన్న వయో పరిమితిని 57 ఏళ్లకు కుదించడమే కాకుండా గత ఆగస్టు 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 10 లక్షల మంది అర్హులకు ప్రభుత్వం పెన్షన్ లను మంజూరు చేసిందని చెప్పారు. హైదరాబాద్ జిల్లాకు 77,695 మందికి నూతనంగా పెన్షన్లు మంజూరు చేసిందని వెల్లడించారు. గతంలో పెన్షన్ డబ్బుల కోసం లబ్ధిదారులు అక్కడా.. ఇక్కడా తిరిగే వారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా పేదింటి ఆడపడుచుల పెండ్లికి లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి అండగా నిలుస్తున్నారని అన్నారు. పేద ప్రజలు సంతోషంగా ఉండాలి, గొప్పగా బతకాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
అంతేకాకుండా పేదలకు మరింత మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టిందన్నారు. కరోనా చికిత్స కు కేరాఫ్ గా గాంధీ హాస్పిటల్ నిలిచింది..ఇదే ప్రభుత్వ హాస్పిటల్స్ అభివృద్ధి చెందాయని చెప్పడానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ బడులను ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ బడులను సర్కార్ తీర్చిదిద్దిందని, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి మంచి విద్యావంతులను చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఆర్‌డిఒ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, కార్పొరేటర్ లు మహేశ్వరి, హేమలత, మాజీ కార్పొరేటర్ లు ఆకుల రూప, ఉప్పల తరుణి, తహసీల్దార్ లు శైలజ, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.