Wednesday, January 22, 2025

నచ్చితే నీతి.. నచ్చకపోతే అవినీతా?

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరాన్ని మెచ్చుకొని ఇప్పుడు ఈ పుచ్చు మాటలెందుకు? 
అవినీతి జరిగితే అనుమతులెలా ఇచ్చారు?
 ప్రకృతి వైపరీత్యంలో పంప్‌హౌస్‌లు మునిగితే రాజకీయమా?
కేంద్ర మంత్రులపై భగ్గుమన్న మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్: మీకు నచ్చితే నీతి.. అవినీతా? ఇదేం వైఖరి? కేంద్రాన్ని పొగిడితే ఒకలా…తిడితే మరోలా వ్యవహరిస్తారా? అంటూ మోడీ సర్కార్ పై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. కేంద్రాన్ని ప్రశ్నించక పోతే సై.. లేదంటే నై అన్నట్టుగా బిజెపి వ్యవహారం ఉందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం నిజస్వరూపాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఎండగడుతుంటే బిజెపి నేతలకు కడుపుమండుతోందన్నారు. మోడీ తప్పిదాలను సూటి గా ప్రశ్నిస్తున్నందునే రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం విషం కక్కుతోందని విమర్శించారు. కాళేశ్వరానికి కితాబిచ్చిన వాళ్లే ఇపుడు ఏదో మతలబు ఉందంటూ పనికిరాని మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును అంతకు ముందు మెచ్చుకున్న నోళ్లతోనే ఇప్పుడు పుచ్చిపోయిన మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. టిఆర్‌ఎస్ ఎల్‌పి కా ర్యాలయంలో మంత్రి కొప్పు ఈశ్వర్, శాసనసభ్యులు ముఠాగోపాల్, మాణిక్‌రావు, సం డ్ర వెంకట వీరయ్య, ఎంఎల్‌సి తాతామధు తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మ రోసారి కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరంపై రెండు రోజుల క్రితం కేంద్ర గజేంద్ర షేకావత్ బాధ్యతా రాహిత్యంగా మాట్లాడారన్నారు. ఆయన మాటలను ఖండిస్తున్నామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ తప్పులను టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎత్తిచూపుతూ వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం వల్లే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒక సారి ఫ్లాష్‌బాక్‌లోకి వెళ్ళి ప్రాజెక్టుపై ఏం మాట్లాడారో తెలుసుకుని…. మీ మతి మరుపును పరీక్షించుకోవాలంటూ ఎద్దేవా చేశారు. పార్లమెంటు సాక్షిగా కాళేశ్వరంపై చెప్పిన నిజాలను ఇపుడు అబద్దాలుగా కేంద్రమంత్రులు ప్రచారం చేస్తున్నారంటే చట్ట సభలు అంటే బిజెపికి ఎంత చులకనగా మారాయో అర్థమవుతుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగితే…మరి కేంద్రం ఎలా అనుమతులు ఇచ్చిందో చెప్పాలని ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కు అనుమతులిచ్చింది మీరే….. అప్పులకు అనుమతులు ఇచ్చింది కూడా మీరేనని అన్నారు.
గతంలో పొగిడిన వారే….
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును పొగిడిన వారే ఇప్పుడు బురద జల్లుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ నుంచి మొదలుకుని అనేక కేంద్ర మంత్రులు కాళేశ్వరాన్ని అద్భుతమైన ప్రాజెక్టు అని ప్రశంసించారన్నారు. ఇదే విషయంపై పార్లమెంట్‌లో సిఎం కెసిఆర్‌ను మోడీ మెచ్చుకోలేదా? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మోడీ పొగిడిన వీడియోను ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల సమక్షంలో చూపించారు. మోడీతో పాటు మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర జలసంఘం చైర్మన్ మసూద్ హుస్సేన్, కేంద్ర పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ శర్మలు కాళేశ్వరం ప్రాజెక్టును పొగిడిన వారేనని హరీశ్‌రావు తెలిపారు. అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టు గ్రోత్ ఇంజిన్ అన్న బిజెపి పెద్దలు మరి ఇప్పుడు ఎందుకు మాట మార్చారో సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కేవలం మోడీ విధాలను సిఎం కెసిఆర్ తప్పు బడుతున్నందుకే కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జూలై 22వ తేదీ, 2021న కేంద్రమంత్రి విశ్వేశ్వర్ తుడు కాళేశ్వరం లో అవినీతి జరగలేదని పార్లమెంటు సాక్షిగా చెప్పారన్నారు. ఇప్పటి మంత్రి షేకావత్ కూడా పార్లమెంటు వేదికగా కాళేశ్వరం లో అవినీతి జరగలేదని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇది ప్రకృతి వైపరీత్యం
గోదావరికి 1986లో అత్యధిక వరద వచ్చిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. అప్పట్లో 107.05 మీటర్ల మేర వరద ప్రవహించిందన్నారు. ఆ రికార్డును ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి వరదలు అధిగమించాయన్నారు. మొన్నటి వరదల స్థాయి 108 మీటర్లు దాటిందన్నారు. ఇది ప్రకృతి వైపరీత్యమన్నారు. 1986 లో కాళేశ్వరం వద్ద సిడబ్లూసి అధికారులు నమోదు చేసిన అత్యధిక వరద మట్టం 107.05 మీటర్లు అన్నారు. ఈ మాట్టాన్ని పరిగణనలోకి తీసుకునే రాష్ట్ర ప్రభుత్వం మెడిగడ్డ బ్యారేజి,కరకట్టలు పంప్ హౌజ్ రేగులేటర్ నిర్మించడం జరిగిందన్నారు. అయితే గోదావరికి అత్యధిక వరద మట్టం నమోదు కావడంతోనే పంపుహౌజ్‌లు మునిగిపోయాయన్నారు. ప్రధానంగా పంప్ హౌజ్ రెగ్యులేటర్ గేట్ల రబ్బర్ సీల్స్ ఊడిపోయినందువల్ల ఫోర్‌బే లోకి పెద్ద త్తున నీళ్లు వచ్చాయని హరీశ్‌రావు వివరించారు. చందనపూర్ వాగు పొంగి అన్నారం బ్యారేజి రక్షణ కోసం నిర్మించిన కరకట్ట పై నుంచి పొర్లినందువల్ల అన్నారం పంప్ హౌజ్ నీట మునిగిందని హరీశ్‌రావు తెలిపారు. అయినప్పటికీ అన్నారం పంప్ హౌజ్ మొత్తం సురక్షితంగా ఉందన్నారు. కన్నె పల్లి పంప్ హౌజ్ లో బిగించిన 17 పంపుల్లో 3 మాత్రమే దెబ్బతిన్నాయన్నారు. యాసంగి పంటకు నీళ్లు రావని మాట్లాడుతున్న బిజెపి నాయకులపై ఈ సందర్భంగా హరీశ్‌రావు మండిపడ్డారు. 45 రోజుల్లో పంపు హౌజ్‌లో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. యాసంగి పంటకు ఖచ్చితంగా నీరందంచి తీరుతామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ విషయంలో రైతులు రందీ పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2009లో కృష్ణ నదికి అసాధారణ వరదలు వచ్చినపుడు శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రం ,కర్నూల్ పట్టణం, ఎస్‌ఎల్‌బిసి సొరంగం, కల్వకుర్తి పంప్ హౌజ్ నీట మునిగాయన్నారు. అయితే వాటిని కొన్ని నెలల్లోనే పునరుద్ధరించుకున్నామన్నారు. వాటిలాగానే సెప్టెంబర్ నెలాఖరు నాటికి కాళేశ్వరం పంప్ హౌజ్ ను పునరుద్ధరించి యధావిధిగా నీటిని ఎత్తి పోస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. రెండు పంప్ హౌజ్ లు తప్ప ప్రస్తుతం అన్నీ పని చేస్తున్నాయని చెప్పారు.
బిజెపి ఆశలు ఆడియాశలు కాక తప్పవు
మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మూత పడాలన్న బిజెపి ఆశలు ఆడియాశలు కాక తప్పవని హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టు పాడైతే బాగుండు అని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోవాలని చూస్తున్న బిజెపి నేతలకు భంగపాటు తప్పదన్నారు. తెలంగాణను ఎన్ని విధాలుగా ఇబ్బందుల పాలు చేయాలని యత్నించినా…సిఎం కెసిఆర్ తన రాజనీతితో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధులు పరుగులు తీయిస్తున్నారన్నారు. అందువల్ల వారి కళలు కల్లలుగా మిగలక తప్పదన్నారు. రాక్షస ఆనందం పొందుతున్న ఆ పార్టీకి నిరాశ తప్పదన్నారు. చవక బారు రాజకీయం చేస్తే పుట్టగతులు ఉండవని ఈ సందర్భంగా హరీశ్‌రావు హెచ్చరించారు.
కేంద్రమే అనుమతిలిచ్చింది
కాళేశ్వరం ప్రాజెక్టు కు కేంద్రం అన్ని అనుమతులిచ్చిందని హరీశ్‌రావు తెలిపారు. కాస్ట్ బెనిఫిట్ రేషియో అనుమతి కూడా 2018 లో వచ్చిందన్నారు. అలాగే టెక్నికల్ అనుమతి కూడా వచ్చిందన్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన వాళ్లే ….ఎపిలో జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కడుతున్నారన్నారు. కాళేశ్వరం కట్టిన వాళ్లకు సామర్ధ్యం లేకుంటే పోలవరం ప్రాజెక్టును ఆ ఏజెన్సీకి ఎలా ఇచ్చారని ఈ సందర్భంగా కేంద్రాన్ని మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కూడా ఆ సంస్థ పని చేస్తోందన్నారు. సామర్థ్యం లేని కంపెనీకి కాళేశ్వరం పనులు ఇచ్చారని కేంద్రమంత్రిగా ఉండి షెకావత్ ఎలా మాట్లాడుతారని మండిపడ్డారు. ఇదంతా చూస్తుంటే కేవలం రాజకీయం కోసమే తెలంగాణపై బిజెపి బురద జల్లే పనులు చేస్తోందన్నారు. యాసంగి పంట కొనేందుకు కూడా కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం 200 శాతం పెరిగిందన్నారు. ప్రాజెక్టులు లేనిదే ఇది సాధ్యం అవుతుందా? అని ప్రశ్నించారు.

Harish Rao slams Centre over Kaleshwaram Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News