Saturday, November 16, 2024

ఈ నెల మూడోవారం నుంచి బతుకమ్మ చీరల పంపిణీ !

- Advertisement -
- Advertisement -

distribution of bathukamma sarees this month

17 రంగులు… 30 రకాల వెరైటీలు…240 డిజైన్‌లు…800 వరకు కలర్ కాంబినేషలు…
రేషన్‌షాపుల్లో కోటి చీరెల పంపిణీకి రంగం సిద్ధం
సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని మరమగ్గాలపై చీరల తయారీ
రోజుకు 1,000 మంది కార్మికులకు ఉపాధి
ఇప్పటికే జిల్లా కేంద్రాలకు 50 శాతం చీరెలు…

హైదరాబాద్: బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ మహిళలు ఘనంగా జరుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ పండుగకు తీరొక్క పువ్వుతో గౌరమ్మను అలంకరించినట్లే బతుకమ్మ ఆడటానికి వెళ్లే మహిళలు తీరొక్క రంగు చీరల్లో అందంగా ముస్తాబవ్వడానికి ప్రభుత్వం వాటిని తయారు చేయించింది. తెలంగాణ అడబిడ్డలు గొప్పగా జరుపుకునే ఈ బతుకమ్మ పండుగను మహిళలు ఆత్మగౌరవంతో జరుపుకునేలా కొన్ని సంవత్సరాలుగా వారికి ఉచితంగా చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అక్టోబర్ 05వ తేదీన దసరా పండుగ రాష్ట్ర ప్రజలు జరుపుకోనున్న నేపథ్యంలో ముందస్తుగా జరుపుకునే బతుకమ్మ కోసం చీరల పంపిణీని ఈ నెల మూడోవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి తయారైన 50 శాతం చీరెలు జిల్లా కేంద్రాలకు అధికారులు పంపించారు. అయితే ఈ చీరల తయారీలో భాగంగా చేనేతకు చేయూతనివ్వాలన్న ఆలోచనతో సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల మరమగ్గాలపై తయారయిన చీరలను ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది.

ఈ ఏడాది రూ.340 కోట్ల వ్యయంతో…
గత సంవత్సరం 26 డిజైన్లతో బతుకమ్మ చీరలను టెస్కో అధికారులు తయారు చేయించగా ఈ సంవత్సరం 240 పైచిలుకు వెరైటీ డిజైన్‌లను బతుకమ్మ చీరల తయారీలో వినియోగించారు. ఈ ఏడాది రూ.340 కోట్ల వ్యయంతో ఒక కోటి 18 లక్షల చీరలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అయితే ఇప్పటికే 50 శాతం చీరలు జిల్లా కేంద్రాలకు చేరాయని, సిరిసిల్లలో తయారయిన బతుకమ్మ చీరలను ప్యాకింగ్ చేసి జిల్లా కేంద్రాలకు పంపిణీ చేసినట్టు టెస్కో అధికారులు తెలిపారు. అయితే బతుకమ్మ చీరల తయారీలో భాగంగా మూడు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు 1,000 మంది చేనేత కార్మికులు ఉపాధి పొందుతున్నారు.

వెండి, బంగారు జరీ అంచులతో….
ఐదు సంవత్సరాలుగా బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చేనేత చీరలను పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి 17 రంగులతో 30 రకాల వెరైటీలతో 240 డిజైన్లతో 800 వరకు కలర్ కాంబినేషన్లో కోటి చీరెలను పంపిణీకి సిద్ధం చేశారు. ఈ సంవత్సరం వెండి, బంగారు జరీలతో పాటు డాబి, జాకాడ్ అంచుల డిజైన్లతో చీరత పంపిణీకి జౌళిశాఖ సిద్ధం చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మహిళల కోసం 9 గజాల చీరలను ప్రత్యేకంగా 8 లక్షల చీరలను ప్రభుత్వం రూపొందించింది. బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని జిల్లా కేంద్రాలకు ఇప్పటికే 50 శాతం చీరలా పంపిణీ చేశామని, మిగతా చీరలను ఈ నెల 15వ తేదీ వరకు అన్ని జిల్లాలో అందుబాటులో ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాల కలెక్టర్‌లకు చీరెల పంపిణీకి సంబంధించిన వివరాలను అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈనెల మూడోవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ షాపులు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేపట్టనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News