Monday, December 23, 2024

జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా లక్షలాది మంది ఆస్తమా రోగులకు ప్రతి ఏడాది మృగశిర కార్తీ ప్రవేశించే రోజున ఉచితంగా అందించే చేప ప్రసాదం పంపిణీని ఈ ఏడాది జూన్ 8న పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని బత్తిని మృగశిర ట్రస్టు ప్రతినిధులు, బత్తిని గౌడ్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ సంవత్సరం మృగశిర కార్తీ జూన్ 8 శనివారం ఉదయం 11 గంటలకు ప్రవేశిస్తుందని, ఆ రోజునే చేప ప్రసాదం పంపిణి ప్రారంభిస్తామని తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బత్తిని అమర్నాథ్ గౌడ్, కుటుంబ సభ్యులు శివ శంకర్ గౌడ్, గౌరీ శంకర గౌడ్, శివ శేఖర్ గౌడ్, సంతోష గౌడ్, మౌళి గౌడ్, రోషన్ గౌడ్ చేప ప్రసాదం పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను వివరించారు. జూన్ 8 ఉదయం 11 నుంచి మరునాడు ఉదయం 11 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్స్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని తెలిపారు.

అమర్నాథ్ గౌడ్ మాట్లాడుతూ దాదాపు రెండు శతాబ్దాలుగా తమ కుటుంబం ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు మృగశిర కార్తీ ప్రవేశించిన ఘడియల్లో ఓ పదార్ధాన్ని చేప ద్వారా రోగి నోట్లో వేస్తామని అన్నారు. వ్యాధి తీవ్రతను బట్టి రోగి నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఈ ప్రసాదం తీసుకుంటే పూర్తిగా రోగం తగ్గుతుందని స్పష్టం చేశారు. చేప ప్రసాదం పంపిణీకి ముందు పూజాకార్యక్రమాల అనంతరం జూన్ 7న దూద్‌బౌలిలో దీనిని తయారు చేస్తామని అమర్‌నాథ్ గౌడ్ వివరించారు. ఈ సేవను తమ కుటుంబ పెద్దలకు 190 సంవత్సరాల క్రితం ఓ మునీశ్వరుడు బోధించారని, అప్పటి నుంచి నిస్వార్ధంగా, ఉచితంగా లక్షలాది మంది శ్వాస సంబంధిత రోగులకు తరతరాలుగా అందిస్తున్నామని అన్నారు. తాము ప్రతి ఏడాది చేస్తున్న ఈ సేవకు ఇప్పటి వరకూ గత ప్రభుత్వాలన్నీ పూర్తి సహకారాన్ని అందిస్తూ, అన్ని ప్రభుత్వ శాఖలు బాధ్యతగా ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారని అమర్నాథ గౌడ్ అన్నారు. ఈ ఏడాది కూడా నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సంబంధిత ఇతర మంత్రులను ఆయా పనులకు సంబంధించిన అనుమతికి ఏర్పాట్లను చేయవలసిందిగా కోరామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News