ఏ సభకైనా వస్తరు… చెప్పింది వింటరు.. తలకు రూ.200 చొప్పున చెల్లింపు..
మనతెలంగాణ/వరంగల్ : పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అందరికన్నా ముందుగా బిఆర్‌ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించగా నియోజకవర్గాల్లో ప్రచారంలో ఆ పార్టీ ముందున్నది. బిఆర్‌ఎస్ అభ్యర్థులు కొందరు ఇంటింటి ప్రచారం ఇప్పటికే నిర్వహించగా కార్నర్ మీటింగ్‌లపై దృష్టి పెట్టి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, బిజెపిలు సైతం ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తుండడంతో జన సమీకరణ సమస్యలగా మారుతోంది. వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచార సభలు దాదాపుగా పూర్తయ్యాయి.
అయితే అగ్ర నేతల ఎన్నికల ప్రచార సభలైన, ఇంటింటా ప్రచారమైన, కార్నర్ మీటింగ్‌లు అయినా పెయిడ్ కార్యకర్తలు కీలకమవుతున్నారు. జన సమీకరణ బాధ్యతలను భుజాన వేసుకున్న ఆయా పార్టీల పోలింగ్ బూత్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు ఒక్కొక్కరికి రూ.200 చొప్పున చెల్లిస్తూ పార్టీల కండువాలు, టోపిలు ఇచ్చి తీసుకువస్తున్న తీరు కనబడుతుంది. జిల్లాలోని వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్థన్నపేట, పరకాల నియోజకవర్గాల్లో ఇటీవల ప్రధాన పార్టీలు నిర్వహించిన బహిరంగ సభలకు ఒక్కొక్కరికి రూ.200 చొప్పున ఇచ్చి వాహనాలు ఏర్పాటుచేశారు.
కాలనీల్లో రోజు వారి ఇంటింటి ప్రచారానికి, అభ్యర్థుల కార్నర్ మీటింగ్‌లకు సైతం రూ.200 చెల్లించి తీసుకువస్తుండడంతో అన్ని పార్టీల ప్రచారానికి మంచి ఊపు కనబడుతుంది. ఉదయం ఓ పార్టీ మీటింగ్‌కు, సాయంత్రం మరోపార్టీ మీటింగ్‌కు వెళ్తూ కండువాలు, టోపీలు మార్చుతున్న పెయిడ్ కార్యకర్తల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రూ.200 ఇస్తే చాలు..ఏ పార్టీ మీటింగ్‌కైనా వెళ్తాం. వారు ఏం చెప్పినా వింటాం…వారికి జనం కావాలి..మాకు డబ్బులు కావాలి..అంటున్న సదరు పెయిడ్ కార్యకర్తలు మాత్రం ఓట్లు వేసేది మాత్రం ఏంటో? గుంభనంగా ఉంచుతున్నారు.