Monday, December 23, 2024

నెరవేరిన ఇళ్ల పట్టాల కల

- Advertisement -
- Advertisement -

1500మందికి పంపిణీతో పండుగ చేసుకున్న
సింగరేణి 11డివిజన్ల కార్మికులు

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంఎల్‌ఎ, విప్ బాల్క సుమన్ చేతులమీదుగా జరిగిన పంపిణీ

మనతెలంగాణ/హైదరాబాద్: సింగరేణిలోని 11 డివిజన్‌లలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగలా జరిగింది. ఈ పట్టాలు మహిళల పేరుతో అందించి టిఆర్‌ఎస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. మహిళల అభ్యున్నతికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం మహిళలకు వాటిని అందించి మరో ముందడుగు వేసింది. శుక్రవారం ఒక్కరోజే సుమారుగా 1,500ల మందికి ఎమ్మెల్యే బాల్క సుమన్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిల చేతులమీదుగా పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. అందులో భాగంగా జిఓ 76ను అమల్లోకి తీసుకొచ్చి సింగరేణి ప్రాంతలలో నివసించే ప్రతిఒక్కరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని, సింగరేణి ప్రాంతాలలో నివసించే ప్రతి ఒక్క కుటుంబం ఆత్మాభిమానంతో బ్రతకాలన్న సంకలాన్ని, దశాబ్ధాల కలను సాకారం చేస్తూ ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పట్టాల పంపిణీ చేపట్టి తరతరాల తరగని నల్ల బంగారంతో తెలంగాణకు మణిహారంగా సింగరేణి సంస్థను నిలిపింది.

ప్రత్యక్ష సాక్ష్యంగా 11 డివిజన్లతో సింగరేణి

సింగరేణిలో పనిచేసే కార్మికులు, కార్మికేతరులు ఎప్పుడూ విలాసవంతంగా బ్రతకలేదు. దినదిన గండం, రెక్కల కష్టంతో, రక్తాన్ని చెమటగా మార్చి కూడబెట్టిన ప్రతి పైసలతో తన సొంత ఇంటి కల సాకారం కోసం ఖర్చు చేసే వారు అక్కడ అధికం.

వారి జీవిత కాలపు కష్టం

మూడు తరాల కార్మికుల చెమట బిందువులకు ప్రత్యక్ష సాక్ష్యంగా 11 డివిజన్లతో సింగరేణి సంస్థ విస్తరించింది. ఈ నేపథ్యంలోనే వారి శేష జీవితం ఇంటి కోసం చేసిన అప్పులకు తాకట్టు పెట్టే దుస్థితికి చరమగీతం పాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సింగరేణిలోని 11 డివిజన్లలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కార్మికులు పండుగలా జరుపుకునేలా చేశారు.

బ్రతుకు సమరంలో కుటుంబాల పోషణ…

చీకట్లను చీల్చుతూ వెలుగులను పంచే నల్లబంగారాన్ని వెలికితీసే కార్మికులు సింగరేణిపై ఆధారపడి బ్రతుకు సమరంలో కుటుంబాలను పోషించుకుంటున్నారు. చిరువ్యాపారులు, వర్తక వాణిజ్య సంఘాలు ఇలా సబ్బండ వర్గాల ప్రజలు సింగరేణితో మమేకమయ్యారు. జాతి, మత తారతమ్యం లేకుండా బీద, ధనిక బేధా భావం లేకుండా లక్షలాది కుటుంబాలు ఒకేరకమైన జీవన విధానాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో వారి దీనస్థితిని చూసి చలించిన సిఎం కెసిఆర్ వారి సొంతింటి కలను సాకారం చేయడానికి నడుంబిగించారు.

తక్కువ ఖర్చుతో సొంత ఇంటి కల

సింగరేణి విస్తరణలో భాగంగా గనులు మూతపడుతున్నా, ఊర్లకు ఊర్లు బొందల గడ్డగా మారుతున్నా కార్మికులను కాపాడుకునే ప్రయత్నాలు గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేదు. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు సింగరేణి ప్రాంతాల్లో అనేక పర్యాయాలు పర్యటించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల కష్టాన్ని, బాధలను గుర్తించి స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో నేడు కార్మికులకు శాశ్వత పరిష్కారాన్ని చూపించారు.

ఆప్యాయ పిలుపులు..అనుబంధపు పలకరింపులు.. ఊరు వాడతో ఉన్న జ్ఞాపకాలు.. ఇవన్నీ వదిలి వేరే ప్రాంతానికి వలస వెళ్లాలంటే ఎవరికైనా కన్నీళ్లు చెమ్మగిల్లక తప్పదు. అందుకే కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో సింగరేణి ప్రాంత ప్రజలు నేడు పట్టాలు అందుకొని, ఎక్కడికక్కడ తక్కువ ఖర్చుతో సొంత ఇంటి కలను సాకారం చేసుకున్నారు.

కార్మికులకు స్థిర నివాసాలు ఏర్పరచడమే….

బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి రామకృష్ణాపూర్, గోదావరిఖని, ఇల్లందు, కొత్తగూడెం లాంటి పట్టణాలు బొందల గడ్డగా మారకుండా ఉండాలన్నా… వర్తక, వాణిజ్య సంఘాలు తిరిగి పుంజుకోవాలన్నా… వలసలు వెళ్లే వారిని ఆపాలన్నా…. చేతి వృత్తులు తిరిగి పుంజుకోవాలన్నా…. చిరు వ్యాపారుల్లో చిరునవ్వు చిందాలన్నా….. కుల వృత్తులు ఆర్థికంగా ఎదగాలన్నా ఆయా పట్టణాలు అస్తిత్వాన్ని కాపాడుకోవడం ఒక్కటే మార్గమని టిఆర్‌ఎస్ ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగా కార్మికులకు స్థిర నివాసాలు ఏర్పరచడమే ప్రత్యామ్నాయని గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా వారికి ఇంటి కలను సాకారం చేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ దయతో కార్మికుల మసకబారిన జీవితాల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. సింగరేణి తల్లి గర్భం నుంచి ఉద్భవించిన పట్టణాలు చరిత్ర కాలగమనంలో కలిసిపోకుండా తిరిగి ప్రాణం పోసుకుంటున్నాయి. కళ్లముందే సొంతింటి కల సాకారం అవుతుంటే ప్రజలు ఆనందంతో పరవశించి పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News