డీలర్లకు ఆదాయం పెరిగేందుకు అధికారులు సన్నాహాలు
మొదటిసారి రూ. 940, తరువాత రూ. 620లకే సిలిండర్
మూడు నెలల తరువాత 14 రకాల పౌరసేవలకు ప్రయత్నాలు
హైదరాబాద్ : నగరంలో రేషన్ డీలర్ల ఆదాయ వనరులు పెంచేందుకు ప్రభుత్వం నూతన ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ముందుగా 5 కేజీల సిలిండర్ల పంపిణీ చేసి, అది విజయవంతమైతే 14 రకాల పౌరసేవాలు తీసుకొచ్చేందుకు పౌరసరఫరాల శాఖ సన్నాహాలు చేస్తుంది. వచ్చేనెల నుంచి మినీ గ్యాస్ సిలిండర్ల పంపిణీ, మూడు నెలల తరువాత ఇంటర్‌నెట్ కేప్, సిటిజన్ చార్జ్‌సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. దీంతో రేషన్ డీలర్లకు కొంత కమీషన్ ఇచ్చి ఆర్దికంగా ఆదుకునేందుకు చర్యలు చేపడుతుంది. పేదలకు కూడా కొంత ఉపశమనం కలిగిస్తుంది. రేషన్ దుకాణం ద్వారా కార్డుదారులతో పాటు ఆధార్‌కార్డు కలిగిన వారికి 5 కిలోల మినీ సిలిండర్లు సరఫరా చేయడానికి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతినెలా రేషన్ పంపిణీ చేసినట్లు మినీ సిలిండర్లు సైతం తీసుకునే అవకాశం కల్పిస్తుంది. మొదటి సిలిండర్ తీసుకున్నప్పుడు ఒక సిలిండర్‌కు రూ. 940 చెల్లించాలని, తరువాత నెల నుంచి రూ. 620లకే అందిస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిలో గ్యాస్ డీలర్‌కు ఒక సిలిండర్‌కు రూ. 41 కమీషన్ ఇవ్వనున్నారు.
నెలలలో ఎన్ని సిలిండర్లు కావాలన్నా ఇస్తారు. రేషన్ డీలరు 20 సిలిండర్ల వరకు స్టాక్ అందుబాటులో ఉంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నారు. గ్రేటర్ పరిధిలో 975 దుకాణాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తుండగా హైదరాబాద్ జిల్లాలో 17,21,000 ఆహారభద్రత కార్డులు, రంగారెడ్డిలో 6,55,957 కార్డులు, మేడ్చల్ జిల్లాలో 5, 24, 534 కార్డులు ఉన్నాయి. గతంలో బియ్యం పాటు ఐదు రకాలు సరుకులు ఇస్తుండగా ప్రస్తుతం బియ్యం, గోదుమలు మాత్రమే అందిస్తున్నారు. 50కిలోల బియ్యంలో మూడు నుంచి నాలుగు కిలోల తరుగు రావడంతో వచ్చిన కమీషన్ తరుగుకు సరిపోతుంది. నెలమొత్తం కష్టపడితే ఖాళీ సంచులు మాత్రమే మిగులుతున్నాయని, దీనికి తోడు బస్తీల్లో దళారులు బ్లాక్‌లో బియ్యం రూ. 10లకు కొనుగోలు చేసి రీస్లైకింగ్ చేసి పక్క రాష్ట్రాలకు తరలిస్తూ వారు చేసే అక్రమార్కులకు తాము నిందలు పడాల్సివస్తుందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల నుంచి 4జీ సేవలు అమలు చేసి బ్లూటూత్ సాయంతో ఈపాస్ యంత్రానికి అనుసంధానం ప్రక్రియ వేగం చేయాలని కోరుతున్నారు.