హైదరాబాద్ : నగరంలో గత ఆరేళ్ల నుంచి ఎదురు చూస్తున్న కొత్త ఆహారభద్రత కార్డులకు మోక్షం లభించనుంది. రేపటి నుంచి కొత్త కార్డులు అందజేయనున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారులు పేర్కొంటున్నారు. సిఎం కెసిఆర్ నెలకితం గతంలో దరఖాస్తులు చేసి వారి వివరాలు పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని, ఈనెల 26వ తేదీ నుంచి కార్డులు పంపిణీ చేయాలని సూచించడంతో అధికారులు ఆదిశగా ముందుకు వెళ్లుతూ అర్హులకు కార్డులు సిద్దం చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ జిల్లాలోని 09 సర్కిళ్ల పరిధిలో 1.77లక్షల దరఖాస్తులు రాగా, వాటిలో 64,210 మందిని ఇప్పటికే గుర్తించినట్లు, 92వేలు దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు , అర్హతలేని దరఖాస్తులు 21వేలు ఉన్నట్లు ఎంపికైన వారికి కార్డులు రేపి నుంచి పంపిణీ చేస్తామని చెబుతున్నారు. కానీ ఒకే సారి అన్నికార్డులు అందజేయడం సాధ్యంకాదని మొదటి విడుతలో ఎంపిక చేసిన వాటిలో 50శాతం మంది ఇవ్వనున్నట్లు తెలిపారు. కొన్ని కార్డుల విషయంలో పేర్లు తొలగింపు, చేర్చుట వంటివి పూర్తి కాలేదని, వాటిని పరిశీలన చేసిన తరువాత వారికి రెండవ విడుతలో ఇస్తామంటున్నారు.
ప్రస్తుతం జిల్లాలో 5,80,634 కార్డులుండగా కొత్తవి వస్తే 6.20లక్షలు చేరుకుంటాయని అధికారులు వెల్లడిస్తున్నారు. కొత్త కార్డుల ఎంపిక పారదర్శకంగా చేసినట్లు, రాజకీయ జోక్యం లేకుండా లబ్దిదారులను గుర్తించామని, కొన్నిచోట్ల ధనవంతులు పాత కార్డులుంటే వాటని రద్దు చేయకుండా స్దానిక నాయకులతో సిపారసు చేయించారని, అయిన వారికార్డులను తొలగించినట్లు వివరించారు. నిజమైన పేదలకు కార్డుల అందజేస్తామని, రేషన్ సరుకులు బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించే కార్డుదారులకు కత్తెర పెడుతున్నట్లు తెలిపారు. ఆహార భద్రత కార్డుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం, పిల్లలకు ఉపకార వేతనం పొందే ప్రయత్నంలోనే బహుళ అంతస్తుల భవనాలు ఉన్న పేదవాడిగా పేర్కొంటూ ప్రజాధనాన్ని లూటీ చేసే కుట్రలు చేస్తున్నారని, వారు భవిష్యత్తులో అక్రమాలు చేయకుండా తగు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంటున్నారు.