Thursday, January 2, 2025

ఫలించిన పేదల పోరు

- Advertisement -
- Advertisement -

జమునా హేచరీస్ కబ్జా భూముల పంపిణీ

బాధిత రైతులకు భూములు
అప్పగించిన రెవెన్యూ
అధికారులు హక్కుదారులకు
పట్టాలు అందజేసిన ఎంపి
కొత్త, ఎంఎల్‌ఎ మదన్ రెడ్డి
అన్నదాతల కళ్లల్లో ఆనందం
కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
మంత్రి హరీష్‌రావు,
అధికారులకు కృతజ్ఞతలు
తెలిపిన రైతులు

మన తెలంగాణ/పెందూర్తి/మెదక్ ప్రతినిధి: ఎట్టకేలకు న్యాయమే గెలిచిందని, తమ భూములు తమకు దక్కాయని మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హక్కీంపేట గ్రామాలకు చెందిన ఈటల భూ బాధిత రైతులు సంతోషం వ్య క్తం చేశారు. మాజీ మంత్రి, హుజురాబాద్ ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులకు చెంది న జమునా హేచరీస్ సంస్థ తమ భూములను అన్యాయంగా లాక్కున్నారంటూ గతేడాది ఏప్రిల్ 30న బాధిత రైతులు కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. దీంతో విచారణ చేపట్టిన రెవెన్యూ శాఖ ఆ భూములు బాధిత రైతులవేనని తేల్చిచెప్పడంతో బుధవారం ఉదయం జమునా హేచరీస్‌కు చేరుకున్న రెవెన్యూ అధికారులు కబ్జాకు గురైన 85 ఎకరాల 19గుంటల భూమిని తిరిగి 65మంది బాధి త రైతులకు నర్సాపూర్ ఎంఎల్‌ఎ మదన్‌రెడ్డి, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా భూములు కోల్పొయిన దళిత, గిరిజన, బిసి వర్గాలకు చెందిన బాధిత రైతులకు పట్టాలు అందజేశారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. జమునా హేచరీస్ భూ వివాదం నేపథ్యంలో అచ్చంపేట, హక్కింపేట భూములను సమగ్ర సర్వే నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించాలని గతం లో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దీం తో కొన్ని నెలల క్రితం రెవెన్యూ శాఖ అధికారులు ఈ భూములను పూర్తిస్థాయిలో సర్వే చేయగా సర్వే నెం. 77లో 7ఎకరాలు, సర్వే నెం.78లో 13ఎకరాల 2గుంటలు, సర్వే నెం.79లో 11 ఎకరాల 3 గుంటలు, సర్వే నెం.80లో 16ఎకరాల 26గుంటలు, సర్వే నెం.81లో 10ఎకరాల 30 గుంటలు, సర్వే నెం.82లో 10 ఎకరాల 9గుంట లు, సర్వే నెం. 97లో ఎకరం, సర్వే నెం.130లో 15 ఎకరాల 29గుంటలు కబ్జాకు గురైనట్లు అధికారులు కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ భూములను నిరుపేద రైతులకు గత 25 ఏళ్ల క్రితమే ప్రభుత్వం కేటాయించగా వాటిని జమునా హేచరీస్ కంపెనీ ఆక్రమించుకొని ఆ భూముల్లోకి వారిని వెళ్లకుండా దారులుమూసివేయడంతో అప్పట్లో రైతులు తీవ్ర నిరసనలకు దిగారు. బాధిత రైతులు అప్పటినుంచి తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్లతోపాటు ఎమ్మెల్యే, ఎంపిలకు తమ గోడు విన్నవించుకున్నారు. వారం రోజుల క్రితం కూడా కలెక్టరేట్‌కు చేరుకొని తమ భూములు తమకు ఇప్పించాలని బాధిత రైతులు ఆందోళన చేపట్టడంతో కలెక్టర్ స్పందించి మీ భూముల విచారణ తుది దశకు చేరిందని, త్వరలోనే న్యాయం చేస్తామని హామీనిచ్చారు.

అందులో భాగంగానే రెవెన్యూ శాఖ సర్వే పూర్తి చేసి జమునా హేచరీస్ అక్రమణల్లో ఉన్న అచ్చంపేట, హక్కింపేట గ్రామాల్లోని రైతులకు భూములకు సంబంధించిన పట్టాలను అందజేయడంతో పాటు ఆ భూములకు హద్దులను తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాష్, మెదక్ ఆర్డీవో సాయిరాంతోపాటు మాసాయిపేట తహశీల్దార్ మాలతి తదితరులు చూపించారు. ఇప్పటి నుంచి ఈ భూముల రైతులకు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు వర్తించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీనివ్వడంతో రైతుల ఆనందానికి అవదులు లేకుండాపోయింది.

తమ భూములు తమకు తిరిగి ఇప్పించినందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి హరీష్‌రావుతో పాటు సహకరించిన ప్రతిఒక్కరికి రైతులు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ భూముల పంపిణీని నిర్వహించే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉదయం నుంచే జమునా హేచరీస్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తమకు పూర్తి న్యాయం చేసిందంటూ బాధిత రైతులు సిఎం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News