Thursday, December 19, 2024

నూతన సంవత్సరం కానుకగా పేదలకు పట్టాలు పంపిణీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్దీకరణకు దరఖాస్తుల ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో పట్టాలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. దరఖాస్తులు జీవో. 58, 59లకు ఆన్‌లైన్ ద్వారా తీసుకుని, ముందుగా జీవో 58 కింద దరఖాస్తులు చేసిన వారిని గుర్తించి నూతన సంవత్సరం కానుకగా పట్టాలు పంపిణీకి సిద్దం చేశారు. ఆరునెలల క్రితం ప్రత్యేక బృందాలు దరఖాస్తుదారుల ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించారు. ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా విషయాలను పరిశీలించి అర్హులైన పేదలకు పట్టాలు పంపిణీ చేసేందుకు కసరత్తు పూర్తి చేసినట్లు చెబుతున్నారు. ఎంపిక చేసిన వారి జాబితాను ప్రభుత్వానికి అందజేసి, ఉన్నతాధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వారం రోజుల్లో స్థలాల క్రమబద్దీకరణ పత్రాలు అందజేస్తామంటున్నారు.

తరువాత జీవో 59 దరఖాస్తులు కూడా పరిశీలన చేసి రెండు నెలల్లో లబ్దిదారులను గుర్తించి వారికి పట్టాలు పంపిణీ చేస్తామని వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్దీకరించడానికి జీవో నెం. 58, 59 జారీ చేసి గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కోరింది. దీంతో నగర ప్రజలు మీసేవ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తులు సమర్పించారు. మొదటి జీవో నెంబర్లు 58, 59 విడుదల చేయగా దానికి అనుబంధంగా జీవో నెంబర్ 14 విడుదల చేసింది. ప్రభుత్వం 125 గజాల లోపు స్థలాల్లో నిర్మాణాలు చేసుకుంటే ఉచితంగా క్రమబద్దీకరిస్తున్నట్లు పేర్కొంది. 250 గజాలలోపు ఉన్నవాటిని మార్కెట్ విలువలో 50శాతం, 250 నుంచి 500 గజాలలోపు ఇళ్లకు 75శాతం అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటే వందశాతం రుసుము వసూలు చేస్తున్నట్లు వెల్లడించింది.

మూడు జిల్లాల పరిధిలో ఎక్కువగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. గ్రేటర్ పరిధిలో మొదట్లో 1.15లక్షల దరఖాస్తులు రాగా, అత్యధికంగా రంగారెడ్డిలో 31,830, మేడ్చల్‌లో 71,318 హైదరాబాద్ జిల్లాలో 11,675 దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. వీటిలో 60 శాతం దరఖాస్తులను అర్హులుగా గుర్తించినట్లు, మిగతా దరఖాస్తులపై ఫిర్యాదులు వచ్చినట్లు, నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి, నోటిఫికేషన్ వచ్చిన తరువాత మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టి భూములను కబ్జా చేసేందుకు కుట్రలకు పాల్పడ్డారని తెలిపారు. వాటిని పక్కకు పెట్టినట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న దరఖాస్తులను మాత్రమే గుర్తించినట్లు స్థానిక తహసీల్దార్లు పేర్కొంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News