Monday, December 23, 2024

పేదలు మనుషులు కారా?

- Advertisement -
- Advertisement -

రానురాను ప్రజలంటే అమాంబాపతు ప్రాణుల్లా మారిపోతున్నారు. మూకలుగా, రూకలకు లొంగిపోయే వారుగా, ఎవరో విదిలించే దానానికో, ధర్మానికో పొంగిపోయేవారుగా, మహా అయితే బీరుకో, బిర్యానీకో అమ్ముడుపోయే ఓటర్లుగా మాత్రమే వారిని చూస్తున్న రోజులివి. అంతే తప్ప హక్కులు, ఆకాంక్షలున్న మనుషులుగా మాత్రం పరిగణన పొందలేకపోతున్నారు. యెమెన్ నుంచి మన మహారాష్ట్ర, ఎపిల వరకు ప్రజలను చిల్ల పెంకు విలువ లేని చిల్లర మనుషులుగా చూసి వారి ప్రాణాలకు బొత్తిగా ప్రాధాన్యం ఇవ్వని సందర్భాలు ఇటీవల వరుసగా జరిగిపోయాయి. హౌతీ తిరుగుబాటుదార్ల పట్టులోని యెమెన్ రాజధాని సనా (ఉత్తర యెమెన్) లో గురువారం నాడు రంజాన్ కానుకల పంపిణీ సందర్భంగా సంభవించిన తొక్కిసలాటలో 85 మంది దుర్మరణం పాలయ్యారంటే ప్రజల ప్రాణాలకు ఈ ఆధునిక యుగంలో కూడా బొత్తిగా రక్షణ కరవైందని చెప్పడానికి వెనకాడాలా? ఎనిమిదేళ్ళుగా హౌతీల అరాచక హింస, విధ్వంసాలకు బలైపోతున్న యెమెన్‌లో దారిద్య్రం ఊహించని స్థాయిలో విలయ తాండవం చేస్తున్నది. కోటి 30 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారు.

సంవత్సరాల తరబడి జీతాల్లేక ఉద్యోగుల కుటుంబాలే కడుపు నిండా తిండికి ముఖం వాచిపోయి వున్నాయంటే సాధారణ ప్రజల సంగతి వివరించనక్కర లేదు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరికి 8 నుంచి 10 అమెరికన్ డాలర్ల కానుకలు ఇస్తామని అక్కడి వ్యాపారులు ప్రకటించడంతో వాటి కోసం జనం ఇసుక వేస్తే రాలనంతగా పోటెత్తారు. కానుకలు పంచడానికి ఉద్దేశించిన మయీన్ స్కూలు గేటు వద్ద జనం అసంఖ్యాకంగా చేరారు. స్కూలు గేటు తెరిచే సరికి తొక్కిసలాట మొదలై ఎవరి మీది నుంచి ఎవరు తొక్కుకుంటూ పోతున్నారో, ఎవరి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయో తెలియని అయోమయావస్థ నెలకొన్నది. ఇక్కడ మనుషులను గడ్డి పోచల కంటే, చీమలు, దోమల కంటే అల్పంగా చూశారని, కనీస భద్రత చర్యలు కూడా తీసుకోలేదని బోధపడుతున్నది. ఒకవైపు ఇరాన్, మరో వైపు సౌదీ అరేబియా ఇస్తున్న మద్దతుతో తిరుగుబాటుదార్లు చెలరేగిపోతున్న దుర్భర వర్తమానానికి ఆ రెండు దేశాల మధ్య చైనా మధ్యవర్తిత్వంలో ఇటీవల కుదిరిన శాంతి ఒప్పందంతోనైనా తెరపడుతుందేమో చూడాలి.

మన మహారాష్ట్రలో కాల్చిన ఇనుములాంటి ఎర్రటి ఎండలో ఘనత వహించిన బిజెపి శివసేన (షిండే) ప్రభుత్వం ఇటీవల మహారాష్ట్ర భూషణ్ అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు హాజరైన జనంలో 13 మంది వడగాడ్పులకు అక్కడికక్కడే మృతి చెందారు. 18 మంది స్పృహ తప్పిపోయారు. ఈ ఘటన ఎంతటి హృదయ విదారకమైనదో చెప్పనక్కర లేదు. ప్రభుత్వమే నిర్వహించిన ఈ మహాసభ వద్ద కనీసం చల్లని మంచి నీళ్ళు కూడా అందుబాటులో లేకపోడం నిర్వాహకుల బాధ్యతారాహిత్యానికి తిరుగులేని నిదర్శనం. అసలు అవార్డు ప్రదానోత్సవ సభను మండుటెండా కాలంలో మిట్టమధ్యాహ్నం నిర్వహించడంలోని విజ్ఞత తీవ్రంగా ప్రశ్నించదగినది. సభకు హాజరైన ప్రజల ప్రాణాల పట్ల బొత్తిగా బాధ్యత లేని పాలక దురహంకారానికి కొలబద్దలు లేవు. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో మహా ఘనత వహించిన ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు కానుకల సమర్పణ సభల్లో 11 మంది దుర్మరణం పాలయ్యారు.

ఇందులో ఒకటి నెల్లూరు జిల్లా కందుకూరులో సంభవించగా, మరొకటి గుంటూరులో చోటు చేసుకొన్నది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు విషాద ఘటనలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి కానుకల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన సందర్భాల్లోనే సంభవించాయి. ఆంధ్రప్రదేశ్‌లో శాసన సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయనే దృష్టితో ప్రతిపక్ష టిడిపి వరుసగా బహిరంగ సభలను నిర్వహించదలచింది. ఓటర్లను ఆకట్టుకోడం కోసం పేదలకు ఎన్‌టిఆర్ జనతా వస్త్రాలు, రేషన్ సరకులు ఇవ్వాలని సంకల్పించారు. కందుకూరు సభలో ఈ కానుకల కోసం జనం ఎగబడడంతో తొక్కిసలాట సంభవించి ఇద్దరు మహిళలు సహా 8 మంది మృతి చెందారు. ఆ తర్వాత నాలుగు రోజులకు జరిగిన గుంటూరు సభలో ముగ్గురు మహిళలు ప్రాణాలు విడిచారు. గుంటూరు సభలో కానుకల పంపిణీకి 30 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి 12 కౌంటర్లతోనే సరిపుచ్చడంతో వాటిని కూడా దగ్గర దగ్గరగా నెలకొల్పడంతో తొక్కిసలాట సంభవించిందని వార్తలు చెప్పాయి

. కానుకల కిట్ల పంపిణీకి మధ్యాహ్నం ఒంటి గంట నుంచే పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో జనం అసంఖ్యాకంగా చేరుకొన్నారు. మధ్యాహ్నం మూడున్నరకు జరగవలసిన పంపిణీ చంద్రబాబు నాయుడు ఆలస్యంగా వచ్చి 6 గం.కు ప్రసంగించిన తర్వాత జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రజలంటే ఓటర్లుగా తప్ప మనుషులుగా చూడనందునే ఈ ప్రమాదాలు సంభవించాయని చెప్పవచ్చు. మరి పేదలను మనుషులుగా ఎప్పుడు గుర్తిస్తామో!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News