Saturday, November 23, 2024

16 నుంచి మైనార్టీలకు లక్ష చెక్కులు

- Advertisement -
- Advertisement -

10 వేల మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ

ప్రతి నియోజకవర్గంలో జనాభా దామాషా ప్రకారం ఎంపిక ప్రక్రియ

అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం

 

హైదరాబాద్: మైనార్టీల సంక్షేమంలో భాగంగా సిఎం కెసిఆర్ ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మొదటి దశలో భాగంగా ఎంపిక చేసిన 10 వేల మంది లబ్ధిదారులకు ఈనెల 16 నుంచి లక్ష రూపాయల చెక్కుల పంపిణీ ప్రారంభించాలని ఆయన సూచించారు. అసెంబ్లీలో సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు మైనార్టీల సమస్యలపై చర్చించేందుకు సచివాలయంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సిఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, మైనారిటీ సెక్రటరీ ఉమర్ జలీల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మరో రూ. 130 కోట్లు అదనంగా కేటాయించాలి
మైనారిటీలకు లక్ష ఆర్థిక సాయం, ఓవర్ సీస్ స్కాలర్ షిప్స్, స్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్, మౌజం సంఖ్య పెంపు, క్రిస్టియన్ స్మశాన వాటికలు, ఆర్టీఎఫ్, ఎంటిఎఫ్ తదితర అంశాలపై మంత్రులు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇతర వర్గాలతో సమానంగా మైనారిటీ వర్గాల సంక్షేమంతో పాటు అన్ని వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని ఆయన తెలిపారు. స్మశాన వాటికలకు 125 ఎకరాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్, మౌజంల సంఖ్య పెంపు వంటి రెండు హామీలను ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే కేటాయించిన రూ. 270 కోట్లకు అదనంగా, మరో రూ. 130 కోట్లు కేటాయించి మొత్తం రూ. 400 కోట్లు ఈ కార్యక్రమం అమలుకు కేటాయించాలని ఆర్థిక శాఖను మంత్రి ఆదేశించారు.
షాదీముబారక్ చెక్కులను వెంటనే అందించాలి
ప్రతి నియోజకవర్గంలో జనాభా దామాషా ప్రకారం రూ. లక్ష ఆర్థికసాయం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మైనారిటీల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై మరింత దృష్టి సారించాలని మంత్రి అధికారులకు సూచించారు. బిసి, ఎస్టీ, మైనార్టీ సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో శ్మశాన వాటికలు, ఈద్గాల భూముల కోసం వచ్చిన మొత్తం వినతులను క్రోడీకరించాలని, ఈ దిశగా పనులు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి కోరారు. ఒవైసీ పహాడీ షరీఫ్ దర్గా ర్యాంప్ పనులు, దర్గా బర్హనా షా అద్దెల సవరణ, క్రిస్టియన్ స్మశాన వాటికలు, ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఇతర పనులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి, పనులు త్వరగా పూర్తయ్యేలా అవసరమైన నిధులు విడుదల చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. షాదీ ముబారక్‌కు సంబంధించి, ప్రక్రియను వేగవంతం చేసి, లబ్ధిదారులకు వెంటనే చెక్కులు అందేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News