నల్లగొండ: మైనారిటీల సంక్షేమానికి సిఎం కేసిఆర్ కృషి చేస్తున్నారని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్‌రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక అని కొనియాడారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 39 మందికి మంజూరైన రూ.50 లక్షల విలువైన చెక్కులను టిఎస్ ఆగ్రోస్ ఛైర్మన్ తిప్పన విజయసింహారెడ్డితో కలిసి భాస్కర్‌రావు పంపిణీ చేసారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, మైనారిటీ పిల్లల కోసం అద్భుతమైన రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం నిర్మించి నాణ్యమైన విద్యను అందిస్తున్నదని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ముస్లిం యువతుల పెండ్లికోసం షాది ముబారక్ పథకం ద్వారా రూ .1,00,116 ఆర్ధిక సాయం అందజేస్తోందన్నారు. మైనారిటీస్ ఓవర్‌సీస్ పథకం ద్వారా ముస్లిం యువత విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలను మంజూరు చేస్తుందని అన్నారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణాలను మంజూరు చేస్తుందన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకం కారణంగా అనేకమంది మైనారిటీ క్రీ డాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించి, తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడించారని పేర్కొన్నారు. మసీదుల్లో దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్న ఇమామ్‌లకు, మౌజమ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనం అందజేస్తుందన్నారు.
ఇమామ్‌లకు నెలకు రూ.9,997, మౌజమ్‌లకు నెలకు రూ.5,000 గౌరవ వేతనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. మైనారిటీల అభ్యున్నతితోపాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.