మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం సత్ సంకల్పంతో ప్రారంభించిన దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగు నింపుతోందని జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంల యూసుఫ్ గేడలోని కృష్ణకాంత్ పార్కు వద్ద నిర్వహించిన దళితబంధు కార్యక్రమంలో 22 మంది లబ్దిదారులకు వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక తెలంగాణ రా ష్ట్ర ప్రభుత్వం తప్ప దేశంలో ఏ ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. దళిత బంధు ద్వారా ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వచ్చినప్పుడే ఈ పథకం విజయవంతమైనట్లు అన్నారు. ఇందుకు లబ్దిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ మాట్లాడుతూ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమాన్ని మంగళశారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నమన్నారు. దళితులందరినీ ఆర్ధికంగా పైకి తీసుకురావాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకువచ్చిన గొప్ప పథకం ఇందన్నారు. త్వరలోనే మరో 1500 మంది లబ్ధిదారులకు యూనిట్లను అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్య, ఎస్‌సి కార్పొరేషన్ ఈడి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.