Wednesday, January 22, 2025

ఏపిలో 29, 30, 31న టిడిపి, జనసేన జిల్లా స్థాయి సమావేశాలు

- Advertisement -
- Advertisement -

ఐదు రోజుల్లో.. రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కూడా!

మన తెలంగాణ / హైదరాబాద్ : ఏపిలోని రాజమండ్రిలో ఇటీవల జరిగిన తెలుగుదేశం పార్టీ, జనసేన -సమన్వయ సమావేశం నిర్ణయం మేరకు ఈ నెల 29, 30, 31 తేదీల్లో జిల్లా స్థాయిలో ఇరు పార్టీల సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. పార్టీ తరఫున ఆయా జిల్లాల పరిధిలోని ఇంఛార్జులతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు 50 మంది సమావేశంలో పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందించారు. ముఖ్యంగా జిల్లా స్థాయి టిడిపి, జనసేన సమన్వయ సమావేశాలు విజయవంతం చేసేందుకు కలసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్బంగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తమ పార్టీ నేతలకు సూచించారు. గురువారం జనసేన పార్టీ జిల్లాల అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ జిల్లా స్థాయి సమన్వయ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై తమ పార్టీ క్యాడర్‌కు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెలుగుదేశం , జనసేన – సమన్వయ కమిటీ సమావేశాలు సుహృద్భావ వాతావరణం మధ్య నిర్వహించుకోవాలని సూచించారు. పరస్పరం పరిచయం చేసుకోవడంతోపాటు భవిష్యత్తు ప్రజా పోరాటాలు, ఆందోళనల్లో కలసికట్టుగా ముందుకు వెళ్లే విధంగా ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. నవంబర్ 1వ తేదీ నాటికి ఈ రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధం అవుతుందని, జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంతో పాటు టిడిపి సూపర్ సిక్స్ లో ప్రకటించిన అంశాలను కలిపి ఉమ్మడి మేనిఫెస్టోలో రూపొందిస్తున్నామన్నారు.

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంతకాలతో ముద్రించిన కరపత్రాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రెండు పార్టీలు కలవకూడదన్న ఉద్దేశంతో ప్రత్యర్థి పార్టీ వ్యక్తులు కుట్రలు పన్నుతున్నారని, వారి ఉచ్చులో పడొద్దని క్యాడర్‌కు సూచించారు. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశాలను మాత్రమే ముందుకు తీసుకువెళ్లాలని, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో కలసి వెళ్లాలని నిర్ణయించుకున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News