న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు లోక్‌సభలో చర్చ ఆరంభమవుతుంది. మణిపూర్‌లో ఇప్పటి ఘర్షణలపై ప్రధాని మోడీ మౌనాన్ని నిరసిస్తూ, ఆయన సభలో సమాధానం కోసం కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్ష కూటమి ఇండియా మద్దతు ప్రకటించింది. చర్చ దశలో ప్రధాని ఖచ్చితంగా మణిపూర్‌పై మాట్లాడాల్సి ఉంటుంది. గురువారం ప్రధాని మోడీ తమ జవాబు ఇస్తారని వెల్లడైంది. కాగా ప్రతిపక్షం తరఫున రాహుల్ గాంధీ చర్చను ఆరంభిస్తారు.
సభ్యత్వ పునరుద్ధరణ తరువాత సభలో ఇది ఆయన తొలి కీలక స్పందన అవుతుంది. పార్లమెంట్ వర్షాకాల ఆరంభం నుంచి మణిపూర్ విషయంపై ప్రధాని స్పందనకు పట్టుపడుతూ ప్రతిపక్షాలు ఉండటం, దీనికి అధికార పక్షం నుంచి వ్యతిరేకత రావడంతో సభలు సరిగ్గా నడవడం లేదు. ఈ దశలోనే ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఆమోదింపచేసుకుంది. రూల్ 198 పరిధిలో ప్రతిపక్షం తీర్మానం వెలువరించింది. ఈ ప్రభుత్వం పట్ల తమకు విశ్వాసం పోయిందని, దీనిపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు ఈ తీర్మానంలో పేర్కొన్నారు. చర్చ తరువాత సభలో దీనిపై ఓటింగ్ జరుగుతుంది.