న్యూస్‌డెస్క్: అందరి కళ్లూ ఇప్పుడు అమెరికాలోని న్యూ ఆర్లీన్స్‌లోగల ఎర్నెస్ట్ ఎన్ మోరియల్ కనెన్షన్ సెంటర్‌లో జనవరి 14న ప్రారంభమయ్యే మిస్ యూనివర్స్ అందాల పోటీల పైనే ఉన్నాయి. గతంలో భారత్ నుంచి పోటీపడిన సుస్మితా సేన్, లారా దత్తా, హర్మాజ్ సంధూ మిస్ యూనివర్స్ కిరీటాన్ని చేజిక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 86 మంది అందాల భామలు ఈ పోటీలో పాల్గొంటుండగా భారతదేశం తరఫున దివితా రాయ్ ఈ పోటీలో పాల్గొంటున్నారు. మిస్ యూనివర్స్ పోటీకి చెందిన నేషనల్ కాస్టూమ్ రౌండ్‌లో దివితా రాయ్ బంగారు చిలకను ధరించి అందరినీ ఆకట్టుకున్నారు.
దివితా రాయ్ ధరించిన బంగారు వర్ణం డ్రస్సు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాస్టూమ్ డిజైనర్ అభిషేక్ శర్మ ఈ బంగారు చిలక డ్రస్సును రూపొందించారు. 1998 జనవరి 10న కర్నాటకలోని మంగళూరులో జన్మించిన దివితా రాయ్ రాజాజీనగర్‌లోని నేషనల్ పబ్లిక్ స్కూలులో విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత ఆమె ముంబైకు తరలివెళ్లారు. అక్కడ సర్ జెజె కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చసిన ఆమె మోడల్‌గా రాణించారు. 2022లో మిస్ దివా యూనివర్స్ విజేతగా నిలిచిన దివితా రాయ్ తనకు మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ స్ఫూర్తని చెబుతున్నారు.