Friday, December 20, 2024

అందం.. జనం కోసం స్పందించే నైజం

- Advertisement -
- Advertisement -

రాజకుమారి దియాకు ఉపముఖ్యమంత్రి పగ్గాలు

జైపూర్ : ఇప్పుడు రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి పదవిలోకి వస్తున్న రాజకుమారి దియాకుమారి ప్రస్తుతం బిజెపి ఎంపిగా కూడా ఉన్నారు. జైపూర్ రాజకుటుంబంలో ఆమె 1971 జనవరి 30న జన్మించారు. ఆమె పూర్వీకులది రాజరిక కుటుంబం. తండ్రి సవాయ్ భవానీ సింగ్ బ్రిగేడియర్ హోదాలో భారతీయ సైన్యంలో పనిచేశారు. కాగా ఆమె తాతయ్య మాన్‌సింగ్ బ్రిటిష్ వారి హయాంలో జైపూర్ చివరి మహారాజా హోదాలో ఉన్నారు. తండ్రి భవానీ సింగ్ 1971 భారత్ పాక్ యుద్ధం దశలో ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా మహావీర్ చక్ర పురస్కారం అందుకున్నారు.

ఉపముఖ్యమంత్రి నియుక్త దియా విద్యాభ్యాసం మహారాణి గాయత్రీ దేవీ స్కూల్‌లో, తరువాత మహారాణి కాలేజీలో సాగింది. ఆమె వివాహం నరేంద్ర సింగ్‌తో జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో కొడుకు పద్మనాభ సింగ్ ఇప్పుడు జైపూర్ రాజరిక కుటుంబ ప్రతినిధిగా రాజుగా ఉన్నారు. దియాకుమారి తన భర్తకు 2018లో విడాకులు ఇచ్చారు. 2013లో దియాకుమారి రాజకీయ జీవితం ఆరంభం అయింది. సవాయ్ మాధోపూర్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. రాజరిక కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఆమె గ్రామీణ ప్రాంతాల స్థితిగతులను ఆకళింపు చేసుకున్నారు.

పలు వర్గాల అభ్యున్నతికి , జైపూర్ శివార్లలోని అనేక గ్రామీణ ప్రాంతాలలో కనీస వసతుల ఏర్పాట్లుకు చర్యలు తీసుకున్నారు. అక్కడి జనం సమస్యలను తెలుసుకున్నారు. కాగా 2019లో ఆమె బిజెపి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారు. అప్పుడు రాజసమంద్ నియోజకవర్గం నుంచి ఎంపిగా భారీ మెజార్టీతో గెలిచారు. దియాకుమారి పలు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించారు.

రాజస్థాన్ ఐ బ్యాంక్ సొసైటీ , హెచ్‌ఐవి /ఎయిడ్స్ నిర్మూలనకు ఏర్పాటు అయిన రేస్ సంస్థలో ప్రధాన పాత్ర పోషించారు. బాలల బాగోగుల కార్యక్రమాలలో కూడా కీలకంగా ముందుకు కదిలారు. ఓ దశలో ఈ రాజకుమారిని ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడుతారని పార్టీ వర్గాలలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆమెను రెండో దర్జాలో తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News