సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా డిజె టిల్లు. ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. విమల్ కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. శనివారం థియేటర్‌లలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు విమల్ కృష్ణ మాట్లాడుతూ “సిద్ధును డైరెక్ట్ చేసినందుకు గర్వంగా ఉంది. సూపర్బ్ పర్మార్మర్ అతను. ట్రైలర్‌తో సగం సక్సెస్ అందుకున్నాం.
మిగతాది థియేటర్‌లో వస్తుందని ఆశిస్తున్నాం”అని అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ “పూర్తి ఫన్ ఫిల్మ్ ఇది. థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయండి”అని పేర్కొన్నారు. హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ “ప్రేక్షకులకు పూర్తి వినోదాన్నిచ్చి నవ్వించే చిత్రమిది. సితార సంస్థలో పనిచేయడం గర్వంగా ఉంది. నిర్మాత వంశీ సినిమాకు కావాల్సింది చేసుకో అన్నారు. త్రివిక్రమ్ మాకు మార్గదర్శిలా ఉన్నారు. తమన్‌తో పనిచేయడం ఒక మంచి అనుభవం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వక్ సేన్, ప్రవీణ్ సత్తారు, సిమ్రాన్ చౌదరి, ప్రగతి, కాసర్ల శ్యామ్, రవికాంత్ పేరేపు, శ్రీచరణ్ పాకాల, హర్ష్ కానుమిల్లి, ప్రిన్స్, రామ్ మిర్యాల పాల్గొన్నారు.