Saturday, November 16, 2024

రెండున్నరేళ్ల తర్వాత డికె శివకుమారే సిఎం: కాంగ్రెస్ ఎమ్మెల్యే జోస్యం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్‌లో వర్గపోరు క్రమంగా బహిర్గతమవుతోంది. కర్నాటక డిప్యుటీ ముఖ్యమంత్రి డికె శివకుమార్‌పై తమ అభిమానాన్ని కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే వ్యక్తం చేస్తుండడం ముఖ్యమంత్రి సిద్దరామయ్యను బలపరిచే ఎమ్మెల్యేలకు మింగుడుపడడం లేదు.

కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అప్పటి కెపిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ చాలా కష్టపడ్డారని, రెండున్నరేళ్ల తర్వాత ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మాండ్యకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్(గనిగ రవి) చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారాన్ని రేపాయి. త్వరలోనే డికె శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని, ఇందులో ఎటువంటి గందరగోళం లేదంటూ రవి ప్రకటించారు.

శుక్రవారం రవి విలేకరులతో మాట్లాడుతూ డికె శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించడం పార్టీ అధిష్టాన వర్గం చేతుల్లో ఉందని, మొదటి రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఉంటారని, మిగిలిన రెండున్నరేళ్లు శివకుమార్ ఉంటారని, ఇందులో ఎటువంటి గందరగోళం లేదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య సమర్థవంతంగా పనిచేస్తున్నారని, సమయం వచ్చినపుడు అన్నిటిపై నిర్ణయం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎటువంటి విభేదాలు లేవని, తామంతా ఒకే వర్గమని కూడా ఆయన చెప్పారు.

కాగా రవికుమార్ వ్యాఖ్యలపై కర్నాటక భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబి పాటిల్ స్పందించారు. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో పార్టీ అధిష్టానం, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, రణదీప్ సిగ్ సుర్జీవాలా వంటి నాయకులు నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సన్నిమితుడైన ఎంబి పాటిల్ చెప్పారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు అవసరం లేదని, ఎవరు క్యాబినెట్‌లో ఉండాలో పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. తమ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారంటూ కొందరు ఎమ్మెల్యేలు తమ నాయకుడి మీద ప్రేమతో జోస్యం చెబుతుంటారని, ఇటువంటి వ్యవహారాలన్నిటినీ పార్టీ అధిష్టానం గమనిస్తూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News