బెంగళూరు : కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ రానున్న రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కానున్నారని కాంగ్రెస్ వెటరన్ నేత వీరప్ప మొయిలీ చేసిన ప్రకటనపై వ్యాఖ్యానించడానికి శివకుమార్ సోమవారం నిరాకరించారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని డికెఎస్ అన్నారు. నాయకత్వం మార్పు అంశంపై బాహాటంగా మాట్లాడవద్దని పార్టీ నేతలు, కార్యకర్తలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇచ్చిన ఆదేశాలను కూడా శివకుమార్ ఈ సందర్భంగా ఉటంకించారు.
శివకుమార్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరని, అది ‘తేలిన వ్యవహారం’ అని మొయిలీ ఆదివారం విస్పష్టంగా ప్రకటించారు.శివకుమార్ సిఎం పదవిని చేపట్టడానికి ఎక్కువ రోజులు పట్టవని, అది జరిగి తీరుతుందని కూడా మొయిలీ స్పష్టం చేశారు. మొయిలీ ప్రకటనపై విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు శివకుమార్ సమాధానం ఇస్తూ, ‘దాని గురించి నేను ఏమీ చెప్పను. ఆ అవసరం కూడా లేదు. ఆయన (మొయిలీ) తన అభిప్రాయం పంచుకున్నారు. ఎవ్వరూ మాట్లాడరాదని ఖర్గే చెప్పారు. నేను దానిని పాటిస్తాను’ అని తెలిపారు.
‘వంతులవారీ ముఖ్యమంత్రి’ లేదా ‘అధికారం పంచుకునే’ సూత్రం కింద ఈ ఏడాది ద్వితీయార్ధంలో ముఖ్యమంత్రి మార్పు గురించి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఊహాగానాలు సాగుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా అయిన శివకుమార్ ముఖ్యమంత్రి పదవికి బలమైన పోటీదారు. సిఎం కావాలన్న ఆకాంక్షను ఆయన బహిర్గతం చేశారు కూడా. 2023 మేలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటన తరువాత ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ శివకుమార్‌కు నచ్చజెప్పి, ఉపముఖ్యమంత్రిని చేసింది.