రామనగర: కర్నాటక పిసిసి అధ్యక్షుడు, ఒక్కలిగ నేత డికె శివకుమార్ వరుసగా ఎనిమిదో సారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో తన కనకపుర స్థానాన్ని భారీ మెజారిటీతో నిలబెట్టుకోవడం ద్వారా ఆయన ఈ రికార్డుసృష్టించారు. కనకపురలో శివకుమార్ 1,21,595 ఓట్లు భారీ మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం పోలయిన ఓట్లలో శివకుమార్‌కు 1,42,156 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్థి జెడి(ఎస్)కు చెందిన బి నాగరాజుకు 20,595 ఓట్లు వచ్చాయి.
బిజెపి అభ్యర్థి ఆర్ అశోక్ 19,602 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.1989నుంచి శివకుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. 2018 ఎన్నికల్లోకన్నా ఈ సారి శివకుమార్‌కు ఎక్కువ మెజారిటీ రావడం గమనార్హం. ఆ ఎన్నికల్లో శివకుమార్ జెడి(ఎస్) అభ్యర్థి నారాయణ గౌడపై 78,909 ఓట్ల మెజారిటీతో విజయంసాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో కనకపుర నియోజకవర్గం ఏర్పాటయినప్పటినుంచి శివకుమార్ వరసగా నాలుగో సారి ఇక్కడినుంచి విజయం సాధించారు. అంతకు ముందు ఆయన ఒకప్పటి సాతనూర్ నియోజకవర్గంనుంచి నాలుగుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.