చెన్నై: రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన డిఎంకె, సిపిఐ, సిపిఎం మధ్య సీట్ల పొత్తు కుదిరింది. సిపిఐ, సిపిఎం పార్టీలకు చెరో రెండు లోక్‌సభ స్థానాలను కేటాయించాలని అధికార డిఎంకె నిర్ణయించింది. తమిళనాడులోని లోక్‌సభ స్థానాలకు సంబంధించిన సీట్ల సర్దుబాటు చర్చలు నేడు ఖరారయ్యాయని, ఒక నిర్ణయానికి మూడు పార్టీలు వచ్చాయని పేర్కొంటూ డిఎంకె గురువారం ఒక అధికారిక ప్రకటన విడుదలచేసింది.
తమిళనాడులో బహుళ పక్ష సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్(ఎస్‌పిఎ)కు సారథ్యం వహిస్తున్న డిఎంకె తన మిత్ర పక్షాలైన ఐయుఎంఎల్, కొంగు దేశఋయ ముర్కోకు కలగం(కెంఎడికె)కు రానున్న లోక్‌సభ ఎన్నికలలో ఒక్కో స్థానాన్ని కేటాయిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది. కాగా..2019 లోక్‌సభ ఎన్నికలలో కూడా రెండు వామపక్ష పార్టీలు రెండేసి స్థానాలలో పోటీ చేసి గెలుపొందాయి. మదురై, కోయంబత్తూరు నుంచి సిపిఎం గెలుపొందగా తిరుపూర్, నాగపట్టిణం నుంచి సిపిఐ గెలుపొందింది. 2019 ఎన్నికలలో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలలో 38 స్థానాలను డిఎంకె కూటమి గెలుచుకుంది.