మధురై స్థానం నుంచి బరిలోకి
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిఎంకె ఎమ్మెల్యే పి శరవనన్ ఆదివారం బిజెపిలో చేరారు. ద్రవిడ పార్టీ నుంచి బిజెపిలోకి చేరిన రెండో లెజిస్లేటర్ ఈయననే. డిఎంకెలో జిల్లా స్థాయి పార్టీ కార్యవర్గ సభ్యుల నుంచి తాను ఇంతకాలం వేధింపులు ఎదుర్కొంటూ వచ్చానని, వారి ఆధిపత్య ధోరణితో విసిగిపొయ్యానని తిరుప్పరన్కుంద్రం ఎమ్మెల్యే అయిన శరవనన్ తమ నిరసన వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎల్ మురుగన్ సమక్షంలో ఈ డిఎంకె ఎమ్మెల్యే కాషాయ కండువా వేసుకున్నారు.
డాక్టర్‌గా ప్రజా సేవలో ఉన్న తాను రాజకీయాలను ప్రజాసేవకు విస్తరణగా భావించానని చెప్పారు. ఈ డాక్టర్ ఆలయ పట్టణం మధురైలో ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. చాలా కాలం క్రితం ఆయన బిజెపిలో ఉన్నప్పటికి తరువాత డిఎంకెలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. మధురైలో డాక్టర్‌గా ఉన్న శరవనన్కు ప్రజలలో ఉన్న అభిమానాన్ని గుర్తించి ఆయనకు ఈ సీటు కట్టబెట్టారని భావిస్తున్నారు.