రూ. 89.19 కోట్ల ఆస్తులు ఇడి జప్తు
న్యూఢిల్లీ: విదేశీ మారక నిర్వహణ చట్ట(ఫెమ) నిబంధనలు ఉల్లంఘించిన కేసులో డిఎంకె ఎంపి ఎస్ జగద్రక్షకన్, ఆయన కుటుంబ సభ్యులపై రూ. 908 కోట్ల జరిమానా విధించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) బుధవారం ప్రకటించింది. 2020లో జగద్రక్షకన్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ. 89.19 కోట్ల ఆస్తులను ఫెమా కింద ఆగస్టు 26న జారీ అయిన ఉత్తర్వుల మేరకు జప్తు చేసుకున్నట్లు ఒక ప్రకటనలో ఇడి తెలిపింది.
76 సంవత్సరాల జగద్రక్షకన్ అరక్కోణం లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త అయిన జగద్రక్షకన్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులపై ఫెమా దర్యాప్తును చేపట్టినట్లు ఇడి వివరించింది. ఈ దర్యాప్తు ఫలితంగా 2020 సెప్టెంబర్ 11న ఫెమాలోని సెక్షన్ 37ఎ కింద ఎంపికి చెందిన రూ. 89.19 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకున్నామని ఇడి తెలిపింది. తాజా ఉత్తర్వుల మేరకు ఈ ఆస్తులను జప్తు చేసుకోవడంతోపాటు రూ. 908 కోట్ల జరిమానా విధించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది.