న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలను ‘గోమూత్ర ’ రాష్ట్రాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డిఎంకె ఎంపి డిఎన్ సెంథిల్ కుమార్ బుధవారం పార్లమెంటుకు క్షమాపణ చెప్పారు.తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. తన వాఖ్యలను రికార్డులనుంచి తొలగించాల్సిందిగా స్పీకర్‌ను కోరారు. జమ్మూ, కశ్మీర్‌కు చెందిన రెండు బిల్లులపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, బిజెపి గెలిచిన రాష్ట్రాలు హిందీ బెల్ట్‌లోనివేనని, వీటిని సహజంగా గోమూత్ర రాష్ట్రాలుగా పిలుస్తారని అన్నారు. బిజెపి దక్షిణాదికి రాలేదని, అక్కడ అడుగుమోపలేరు గనుక ఆయా రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తారనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు. లోక్‌సభలో సెంథిల్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి సభ్యులు మండిపడగా డిఎంకె భాగస్వా పార్టీ అయిన కాంగ్రెస్ కూడా క్షమాపణ చెప్పాలని ఆయనకు సూచించింది. ఈ నేపథ్యంలో సెంథిల్ కుమార్ లోక్‌సభలో క్షమాపణ చెప్పారు.ఈ అంశంపై బుధవారం లోక్‌సభలో బిజెపి సభ్యులు గొడవ చేయడంతో ప్రశ్నోత్తరాల సమయంలో సభ కొద్ది సేపు వాయిదా పడింది.
అనంతరం సభ మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సమావేశం అయినప్పుడు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ ఈ అంశాన్ని లేవనెత్తుతూ, సెంథిల్ చేసిన వ్యాఖ్యలతో డిఎంకె నాయకుడు కెఆర్ బాలు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలు అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. సెంథిల్ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేస్తూ, టిఆర్ బాలు, రాహుల్ గాంధీలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారా? ఓటర్లు బిజెపికి మూడు రాష్ట్రాల్లో విజయం కట్టబెట్టారు. వాళ్లు ఇచ్చిన తీర్పు ఇది. సభ్యుడి వ్యాఖ్యలు భారత దేశాన్ని ఉత్తరాది, దక్షిణాదిగా విడదీసేవిగా ఉన్నాయి. దీన్ని మేము అనుమతించం’ అని ఆయన అన్నారు. తమిళనాడులో మిచౌంగ్ తుపాను కారణంగా వచ్చిన వరదల అంశాన్ని ప్రస్తావిస్తూ దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేసిన టిఆర్ బాలు కుమార్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు.‘ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సరికాదు. పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ ఆ సభ్యుడిని మందలించారు’ అని బాలు చెప్పారు. బాలు ప్రకటన తర్వాత సెంథిల్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు.‘ నిన్న సభలో చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కావు.
అయితే నా వ్యాఖ్యలు కొందరు వ్యక్తులు, వర్గాల ప్రజల మనోభావాలను గాయపరిచి ఉంటే వాటిని ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చేసిన వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని కోరుతున్నా. నా వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నా’ అని సెంథిల్ కుమార్ లోక్‌సభకు తెలిపారు. అంతకు ముందు సెంథిల్ మంగళవారం తాను చేసిన వ్యాఖ్యలపై ‘ఎక్స్’పోస్టుద్వారా విచారం వ్యక్తం చేశారు. కాగా లోక్‌సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సెంథిల్‌కుమార్‌ను డిఎంకె చీఫ్ , తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మందలించినట్లు మంగళవారం ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది. బహిరంగ వ్యఖ్యలు చేసేటప్పుడు హుందాగా వ్యవహరించాల్సిన అవసరాన్ని పార్టీ పదేపదే చెబుతుంటుందని తెలిపింది. ఇండియా కూటమిలోని పార్టీల నేతలు కూడా సెంథిల్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఇష్టానికి అనుగుణంగా ఓటు వేస్తారని, వారిని తప్పుబట్టడం సరికాదని పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు.సెంథిల్‌కుమార్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి వాటిని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు కార్తీ చిదంబరం మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.