Tuesday, December 24, 2024

ఆధిపత్య పోరుకు తెర

- Advertisement -
- Advertisement -

Corona again in india తమిళనాడు ప్రతిపక్షం ఆల్ యిండియా అన్నా డిఎమ్‌కెలో ఆధిపత్య పోరు వొక కొలిక్కి వచ్చింది. అధికారం అనే సిమెంటు ఊడిపోగానే పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు కత్తులు దూసుకున్నాయి. మెజారిటీ మద్దతు చూరగొన్న పళని స్వామిని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా యెన్నుకోడంతో పేచీ ప్రస్తుతానికి ముగింపుకి వచ్చింది. జయలలిత ఏకచ్ఛత్రాధిపత్యంలో ఆమె అనుభవించిన పదవిలో యిప్పుడు పళని స్వామి కూర్చొన్నారు. అనివార్య కారణాల వల్ల ఆమె అధికారానికి దూరంగా వుండవలసి వచ్చినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పని చేసిన పన్నీరు సెల్వం ఏకాకి అయిపోయారు. జయలలిత మరణించినప్పుడు అధికారంలో గల ఎఐఎడిఎమ్‌కె కుప్పకూలిపోకుండా రెండు వర్గాలను దగ్గరకు చేర్చి అండగా నిలిచి ఆ పార్టీ అధికారంలో కొనసాగేలా చేయడానికి బిజెపి చక్రం తిప్పిన తీరు తెలిసిందే.

జయలలిత ఆత్మీయ సహచరి చిన్నమ్మ శశికళ అధికార పగ్గాలు చేపట్టడానికి చేసిన యత్నాన్ని రాజ్ భవన్‌ను ప్రయోగించి భగ్నం చేసిన ఘనత బిజెపిదే. ఆ తర్వాత స్వామి, సెల్వం వర్గాల ఆధ్వర్యంలో ఆ పార్టీని చివరికంటా అధికారంలో కొనసాగేలా చేసింది కూడా కేంద్ర పాలక పక్షమే. ఆ విధంగా జయలలిత తర్వాత సమర్ధ స్వతంత్ర సారథి లేక అనాథ అయిపోయిన ఎఐఎడిఎమ్‌కె కు బ్యాక్ సీట్ డ్రైవింగ్ వహించిన బిజెపి తమిళ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోవాలని గట్టిగా ప్రయత్నించి ఘోరంగా విఫలమయింది. యెన్నికల్లో తమిళ ప్రజలు ఎమ్‌కె స్టాలిన్ నాయకత్వంలోని డిఎమ్‌కి కి కట్టబెట్టిన చరిత్రాత్మక విజయమే యిందుకు నిదర్శనం. ద్రావిడ మూలాల నుంచి తమను దూరం చేయాలని చూసిన బిజెపిని దాని, యేజెంటు ఎఐఎడిఎమ్‌కెని యెంత మాత్రం క్షమించబోమని తమిళులు తమ తీర్పులో స్పష్టంగా ప్రకటించారు.

గత అసెంబ్లీ యెన్నికలలో వోటమి తర్వాత ఎఐఎడిఎమ్‌కెలో యిద్దరు నాయకుల వ్యవస్థకు పరీక్ష యెదురైంది. ఎన్నికల ముందు వరకూ ముఖ్యమంత్రిగా వున్న పళనిస్వామి పార్టీ కార్యకర్తలను కనుసన్నలలో వుంచుకోడంలో సఫలమయ్యారు. ఆయన పార్టీ నాయకత్వ ఎన్నికకు యీ నెల 11న తేదీన జనరల్ కౌన్సిల్ సమావేశం యేర్పాటు చేయాలని సంకల్పించారు. ఉపముఖ్యమంత్రిగా పని చేసిన ఒ పన్నీర్ సెల్వం వర్గం దీనిని వ్యతిరేకించింది. పార్టీలో యిద్దరు నాయకుల వ్యవస్థ కొనసాగాలని యీ వర్గం వాదించింది. హైకోర్టును ఆశ్రయించింది. 11న కౌన్సిల్ సమావేశం యేర్పాటు చేసుకోడానికి అనుమతించిన వున్నత న్యాయస్థానం మెజారిటీ నిర్ణయమే అంతిమమైనదని స్పష్టం చేసింది. మెజారిటీ వర్గం ఎడప్పాడి పళని స్వామిని యెన్నుకొన్నది. ఒ పన్నీర్ సెల్వం వర్గాన్ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించింది. జయలలిత మరణానంతరం జరిగిన ఏర్పాటులో కోటి ఏభై లక్షలమంది పార్టీ సభ్యులు తనను కో -ఆర్డినేటర్‌గా అంగీకరించారని తన మాటే నెగ్గాలని పన్నీర్ సెల్వం వాపోయినా ఫలితం లేకపోయింది.

జయలలిత అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పన్నీర్ సెల్వం శశికళ వొత్తిడికి లొంగిపోయి రాజీనామా చేసి ఆమె సిఎం కావడానికి దారి చేశారు. కాని అది జరగలేదు. అప్పట్లో రంగ ప్రవేశం చేసిన బిజెపి రెండు వర్గాల మధ్య రాజీ కుదిర్చిన క్రమంలో పళనిస్వామి ముఖ్యమంత్రిగా, పన్నీర్ సెల్వం ఉపముఖ్యమంత్రిగా ఉండేలా, అదే సమయంలో పార్టీ కో ఆర్డినేటర్‌గా పన్నీర్ సెల్వం, సహ కో ఆర్డినేటర్‌గా పళనిస్వామి వ్యవహరించేలా యేర్పాటు చేసింది. బిజెపి పడగ నీడలోనే వీలైనంత స్వతంత్ర ముఖ్యమంత్రిగా పని చేసేందుకు పళని స్వామి ప్రయత్నించారు. ద్రావిడ రాజకీయాల కేంద్ర స్థానం తమిళనాడులో బిజెపి తమకు గుదిబండ మాదిరిగా మారిందనే స్పృహతోనే పళనిస్వామి జాగ్రత్తగా అడుగులు వేశారు. ఇప్పుడు పళనిస్వామి ఆధిపత్యాన్ని బిజెపి పరోక్షంగా అంగీకరించినట్టు వెల్లడైంది.

పన్నీరు సెల్వం తన వెంట పడుతున్నా అది పట్టించుకోడం లేదు. అయితే జయలలితకు అత్యంత విధేయుడిగా నిరూపించుకున్న పన్నీరు సెల్వం వైపు ఆ పార్టీ కార్యకర్తల్లో ఎంత మంది వుంటారో, ప్రజలు ఏమేరకు ఆయనను అంగీకరిస్తారో ఎన్నికలలో తేలవలసి వుంది. పళని స్వామి నాయకత్వంలోని ఎఐఎడిఎంకె పూర్వం మాదిరిగా డిఎంకెకి దీటైన ద్రవిడ పక్షం కాగలుగుతుందా? స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకె ఆయన ప్రజాహిత పాలన రీత్యా ముందు ముందు ఏకైక ద్రవిడ పక్షంగా నిరూపించుకొని ఎఐఎడిఎంకెను నామరూపాల్లేకుండా చేయగలుగుతుందా? జయలలిత సినీ గ్లామరు ఇప్పుడు ఎఐఎడిఎంకెకు లేదు. ఏమైనప్పటికీ ఆ పార్టీలో ఉభయ నాయకత్వ దశకు తెరపడిపోయి పళనిస్వామి సారథ్యంలో అది పునరుజ్జీవనం పొందే అవకాశాలు కలగడం మేలైన పరిణామం. బిజెపి నీడలో వుండి కేంద్రం రుద్దిన నీట్ వంటి అంశాలను వ్యతిరేకించలేకపోయిన వెన్నెముక లేని స్థితి నుంచి బయటపడి ఎఐఎడిఎంకె ఏ మేరకు గట్టి ద్రవిడ పార్టీగా నిరూపించుకోగలుగుతుందో ముందు ముందు చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News