Wednesday, January 22, 2025

నీట్‌తో లక్షల కోట్ల కోచింగ్ సెంటర్ల వ్యాపారం: డిఎంకె

- Advertisement -
- Advertisement -

చెన్నై: వైద్య ప్రవేశ పరీక్ష నీట్‌ను వ్యతిరేకించిన తొలి రాష్ట్రం తమిళనాడుగా అధికార డిఎంకె అభివర్ణించింది. ఇప్పుడు నీట్ అక్రమలు, అవకతవకలు వెలుగులోకి రావడంతో నీట్‌కు వ్యతిరేకంగా ప్రధాన రాజకీయ పార్టీలు సైతం గొంతు విప్పుతున్నాయని డిఎంకె తెలిపింది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లోక్‌సభలో నీట్ వ్యవహారాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తున్న నేపథ్యంలో లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్న కోచింగ్ సెంటర్ల సంక్షేమం కోసం సృష్టించిన వ్యాపార సంస్థ లేదా పరిశ్రమగా ఈ వైద్య ప్రదేశ పరీక్షను డిఎంకె అభివర్ణించింది.

నీట్ యుజి అక్రమాలు, ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి సిబిఐ సాగిస్తున్న సోదాలు, చేస్తున్న అరెస్టులను ప్రస్తావిస్తూ నీట్ అక్రమాలపై బిజెపి భాగస్వామ్య పక్షమైన జెడియు బీహార్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన విషయాన్ని డిఎంకె గుర్తు చేసింది. దేశంలోని ప్రధాన పార్టీలన్నీ నీట్‌కు వ్యతిరేకంగా తమ గొంతు విప్పుతున్నాయని డిఎంకె తన అధికార పత్రిక మురసోలిలో సోమవారం పేర్కొంది.

నీట్ అక్రమాలపై పార్లమెంట్ ఉభయ సభలలో చర్చ జరగాలని డిఎంకె కోరుతోందని, రాహుల్ గాంధీ కూడా దీనిపై చర్చ జరగాల్సిందేనని డిమాండు చేస్తున్నారని తెలిపింది. నీట్ మంచిదా లేక చెడ్డదా అన్న విషయాన్ని మిగిలిన రాష్ట్రాల కన్నా ముందుగానే తమిళనాడు అర్థం చేసుకుందని తమిళనాడు క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉదయనిధి మారన్ రాష్ట్ర అసెంబ్లీలో కొద్ది రోజుల క్రితం జరిగిన చర్చలో పేర్కొన్న విషయాన్ని మురసోలి ప్రస్తావించింది. అదే విధంగా హిందీ భాషను రుద్దడాన్ని వ్యతిరేకించాలని తమిళనాడు ప్రజలు ఇతరుల కన్నా ముందుగానే అర్థం చేసుకున్నారని పత్రిక పేర్కొంది. నీట్ మోసపూరితమైనదని దేశంలో అందరికన్నా ముందుగా తమిళనాడు ప్రకటించిందని జులై 1న వెలువడిన తన సంపాదకీయంలో మురసోలి పేర్కొంది.

నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని, ఈ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ జూన్ 28న తీర్మానాన్ని ఆమోదించిన విషయాన్ని మురసోలి ప్రస్తావించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలకు నీట్ మోసాల గురించి అర్థమవుతోందని పత్రిక తెలిపింది. సామాజిక న్యాయానికి ఈ ప్రవేశ పరీక్ష వ్యతిరేకమని డిఎంకె ఎప్పటి నుంచో చెబుతోందని పత్రిక తెలిపింది. ఈ పరీక్ష పేదలు, గ్రామీణ విద్యార్థుల ప్రయోజనాలకు వ్యతిరేకమని, ఇది కోచింగ్ సెంటర్లకు మాత్రమే అనుకూలమైనదని పత్రిక తెలిపింది.

నీట్ నుంచి తమ రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ జూన్ 28న ప్రధాన నరేంద్ర మోడీకి లేఖ రాశారని తెలిపింది. అదే విధంగా ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలు పాలిస్తున్న ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్నాటక, కేరళ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు కూడా నీట్‌ను రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానాలను ఆమోదించాలని కోరుతూ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్టాలిన్ విడిగా లేఖలు రాశారని మురసోలి వివరించింది. తమిళనాడులో ప్రతిపక్ష అన్నాడిఎంకె కూడా నీట్‌ను వ్యతిరేకిస్తున్న విషయాన్ని పత్రిక ప్రస్తావించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News