Thursday, January 23, 2025

మిత్రపక్షాలతో డిఎంకె సీట్ల పొత్తు ఖరారు

- Advertisement -
- Advertisement -

చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై తన మిత్రపక్షాలైన విసికె, ఎండిఎంకెతో అధికార డిఎంకె పొత్తు ఖరారు చేసుకుంది. ఈ రెండు పార్టీలతో 2019 ఒప్పందాన్ని డిఎంకె పునరావృతం చేసింది. విడుదలై చిరుతైగల్ కట్చి(విసికె)కు రెండు రిజర్డ్ నియోజకవర్గాలను డిఎంకె కేటాయించింది. వైకో సారథ్యంలో ఎండిఎంకెకు ఒక సీటును కేటాయించింది. 2019 ఎన్నికల్లో కూడా వైకో పార్టీకి ఒక లోక్‌సభ స్థానాన్ని కేటాయించినప్పటికీ ఒక రాజ్యసభ స్థానాన్ని కూడా ఆ తర్వాత ఇచ్చింది.

విసికె వ్యవస్థాపకుడు తోల్ తురుమావలవన్, ఎండిఎంకె అద్యక్షుడు వైకో శుక్రవారం చెన్నైలోని డిఎంకె ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో సీట్ల ఒప్పందానికి సంబంధించి డిఎంకె అధినేత, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌తో కలసి సంతకాలు చేశారు. అనంతరం విలేకరులతో తిరుమావలవన్ మాట్లాడుతూ తమ పార్టీ చిదంబరం, విల్లుపురం నియోజవకర్గాలలో పోటీ చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు స్థానాలను ఆ పార్టీ లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తోంది. గత ఎన్నికల్లో చిదంబరం నుంచి తిరుమావలవన్ ఎన్నికయ్యారు.

ఒక జనరల్ కేటగిరి సీటుతో సహా తమకు కనీసం మూడు స్థానాలు ఇవ్వాలని విసికె కోరినప్పటికీ తమిళనాడులో, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితితోపాటు డిఎంకె కూటమి గెలుపును దృష్టిలో ఉంచుకుని రెండు స్థానాలతో సర్దుకుపోవాలని నిర్ణయించుకున్నట్లు తిరుమావలవన్ తెలిపారు. తమ సొంత చిహ్నం మట్టి కుండపై పోటీ బిసికె పోటీ చేయనున్నది. కర్నాటక, కేరళ, తెలంగాణలోని 15 లోక్‌సభ స్థానాలలో తమ పార్టీ పోటీ చేయనున్న కారణంగా తమకు జనరల్ సింబల్ కేటాయించాలని విసికె ఎన్నికల సంఘాన్ని కోరింది.

తమకు కేటాయించిన ఏకైక స్థానం ఏమిటన్నది తర్వాత ప్రకటిస్తానని ఎండిఎంకె వ్యవస్థాపకుడు వైకో తెలిపారు. ఈ ఒప్పందం పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఎండిఎంకె తనకు కేటాయించిన ఒక స్థానంలో పోటీ చేసి విజయం సాధించింది. ఆ తర్వాత వైకో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈసారి కూడా ఒక రాజ్యసభ స్థానాన్ని డిఎంకె కేటాయించనున్నదా అన్న ప్రశ్నకు తన పదవీకాలం ఇంకా 15 నెలలు ఉందని, ఇప్పుడే దాని గురించి మాట్లాడలేనని వైకో చెప్పారు.

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి డిఎంకె ఇప్పటివరకు తన మిత్రపక్షాలైన సిపిఎం, సిపిఐ, ఐయుఎంఎల్, కెఎండికె, విసికె, ఎండిఎంకెతో సీట్ల పొత్తు కుదుర్చుకుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీతో డిఎంకె సీట్ల సర్దుబాటు ఖరారు కావలసి ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికలలో సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్(ఎస్‌పిఎ) పేరుతో తమిళనాడులో బహుళ పక్ష కూటమికి సారథ్యం వహించిన డిఎంకె రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలలో 38 స్థానాలను గెలుచుకుంది. వీటితోపాటు పుదుచ్చేరిలోని ఏకైక లోక్‌సభ స్థానం కూడా డిఎంకె వశమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News