పుదుచ్చేరి: జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(జిప్మర్)లో బలవంతపు హిందీ విధింపును నిరసిస్తూ ప్రతిపక్ష డిఎంకె సోమవారం ఆందోళన నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని జిప్మర్‌లో హిందీని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తూ పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన ఆర్ శివ నేతృత్వంలో ప్రతిపక్ష డిఎంకె నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు.
కాగా..దీనిపై తక్షణమే స్పందించిన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అధికారులతో చర్చలు జరిపి బలవంతంగా హిందీని విధించడం లేదని, తమిళ భాషకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు. జిప్మర్‌కు సంబంధించిన రికార్డులు, వర్తమానాలను హిందీలోనే పంపాలంటూ ఇటీవల జారీ అయిన ఆదేశాలకు వ్యతిరేకంగా డిఎంకె ఆందోళన చేపట్టింది. ఇప్పటికే స్థానికులకు జిప్మర్‌లో ఉద్యోగాలు కల్పించడం లేదని, తాజాగా హిందీ అమలుపై జారీ అయిన సర్కులర్ స్థానికులకు మరో అశనిపాతమని శివ పేర్కొన్నారు. ఈ సర్కులర్‌ను తక్షణమే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు.