చెన్నై: తమ పార్టీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన అవినీతి ఆరోపణలను డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ తిప్పికొట్టారు. తమిళనాడులో అధికార ఎఐఎడిఎంకె చేతులు కలిపి అవినీతితో అంటకాగుతోంది బిజెపియేనని స్టాలిన్ ఎదురుదాడి చేశారు.
ఆదివారం విల్లుపురంలో ఒక బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ అవినీతికి సంబంధించి స్టాలిన్ మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇతరులపై ఆరోపణలు చేసే ముందు సొంత ఇల్లు చూసుకోవాలని, 2జి స్కామ్ ఎవరు చేశారని, కేసులో నిందితులైన కనిమోళి, ఎ రాజా ఏ పార్టీ ఎంపీలని అమిత్ షా ప్రశ్నించారు. దీనిపై స్టాలిన్ సోమవారం స్పందిస్తూ.. ప్రధాని నరేంద మోడీ కూడా గతంలో ఇదే తరహాలో మాట్లాడారని, ఇప్పుడు అమిత్ షా మాట్లాడారని, రేపటి నుంచి కేంద్రం నుంచే వచ్చే బిజెపి నాయకులు కూడా ఇదే తరహాలో మాట్లాడతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అవినీతి, కమీషనర్లు, వసూళ్లలో పీకల్లోతు మునిగిపోయిన ఓపిఎస్(ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం), ఇపిఎస్(ముఖ్యమంత్రి పళనిస్వామి)తో చేతులు కలిపింది ఎవరంటూ గత నెల ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాలొన్న ప్రధాని మోడీ వారిద్దరితో చేతులు కలిపి అభివాదం చేసిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
DMK Stalin Slams BJP of siding with Corrupt AIADMK