చెన్నై: నేషనల్ ఎంట్రెన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్(నీట్)పై అధికార డిఎంకె, రాజ్‌భవన్ మధ్య ఘర్షణ వైఖరి తలెత్తడంతో రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి గురువారం ఇస్తున్న ఎట్ హోం రిసెప్షన్(తేనీటి విందు)కు హాజరుకాకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుంది. గవర్నర్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటే ప్రజల మనోభావాలను దెబ్బతినే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నరసు గురువారం విలేకరులకు తెలిపారు. వైద్య కోర్సుల కోసం నిర్వహించే నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన రెండవ బిల్లు స్థితిని తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాల మేరకు తెన్నరసు, ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ రవిని కలుసుకున్నారు. గ్రామీణ విద్యార్థుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందన్న కారణంపై మొదటి బిల్లును గవర్నర్ ఇదివరకు తిరస్కరించడంతో రెండవ బిల్లును తమిళనాడు అసెంబ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమోదించింది. ఈ బిల్లుకు గవర్నర్ ఇంకా ఆమోదం తెలియచేయవలసి ఉన్నదని గవర్నర్‌ను కలసిన అనంతరం గురువారం తెన్నరసు విలేకరులకు తెలిపారు.
తమిళనాడు గవర్నర్ ”ఎట్ హోం”కు డిఎంకె డుమ్మా
- Advertisement -
- Advertisement -
- Advertisement -