కలా, నిజమా అనిపించే సందర్భాలు కొన్ని ఉంటాయి. మన కళ్లను, చెవులను మనమే నమ్మలేని స్థితిలోకి నెట్టివేస్తాయి. అటువంటి ఒక పరిణామం మొన్న ఆదివారం నాడు చోటు చేసుకున్నది. ‘భారత దేశ ప్రజలందరి డిఎన్‌ఎ ఒకటే. హిందువులు, ముస్లింలు వేరు కాదు, వారు కలిసే ఉన్నారు. వారి మధ్య కొత్తగా ఐకమత్యాన్ని నెలకొల్పవలసిన పని లేదు. ఆరాధన పద్ధతిని బట్టి ప్రజలను విడదీసి చూడకూడదు, ముస్లింలు ఈ దేశంలో ఉండరాదనే వాడు హిందువుగా పరిగణించ తగడు. ఆవు పవిత్రమైనది, కాని గో రక్షణ పేరుతో సాటి మనిషిని హతమార్చడం హిందుత్వకు వ్యతిరేకం’ ఈ మాటలు సాక్షాత్తు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధినేత మోహన్ భగవత్ నోట వెలువడడం వింతల్లోకెల్లా వింత అనిపించడాన్ని ఎంత మాత్రం తప్పుపట్టలేము.
ఆర్‌ఎస్‌ఎస్ సైద్ధాంతిక సారథ్యంలో నడుచుకుంటూ దాని చెప్పుచేతల్లో పని చేసే భారతీయ జనతా పార్టీ దేశాధికారాన్ని చేపట్టిన తర్వాత గత ఏడేళ్లలో జరుగుతున్న పరిణామాలను గమనించే వారెవరికైనా ఈ మాటలన్న మోహన్ భగవత్‌లో బంగారు కడియాన్ని చేత పట్టుకొని బాటసారులను పిలుస్తున్న ముసలి పులి కనిపిస్తే ఆశ్చర్యపోనక్కర లేదు. ఏ చిన్న సందు దొరికినా ముస్లింలను వేలెత్తి చూపించి వారిపై ద్వేషాన్ని రెచ్చగొట్టడం తప్ప మరో పని లేనట్టు వ్యవహరిస్తున్న హిందుత్వ శక్తులు మోహన్ భగవత్ మాటలను ఎలా జీర్ణించుకోగలుగుతాయో ఊహించనలవికాని విషయం.
2010-17 మధ్య దేశంలో గో రక్షక దళాలు 63 సార్లు హింసాత్మక దాడులు చేశాయని రాయిటర్స్ సంస్థ నివేదిక నిగ్గు తేల్చింది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడేళ్లలో జరిగిన గో దాడు ల్లో 28 మంది మరణించగా వారిలో 24 మంది ముస్లింలేనని కూడా సమాచారం. ఈ దాడుల్లో మొత్తం 124 మంది గాయపడ్డారు. సగానికి పైగా దాడులు కేవలం వదంతుల ఆధారంగానే జరిగినట్టు తేలింది. ముస్లింలు తమ సొంత వేష, భాషలతో కొత్త ప్రాంతాలకు వెళ్లడం వారి ప్రాణాలకు ముప్పు తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. గో మాంసాన్ని ఇంటిలో ఉంచుకున్నారన్న ఆరోపణతో హతమార్చిన ఘటనలు సంభవించాయి. 201017 మధ్య జరిగిన గో దాడుల్లో సగం బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే సంభవించడం గమనించవలసిన అంశం. ఇవి గో రక్షణ పేరు తో హిందుత్వ శక్తులు ముస్లింపై హింసాత్మక దాడులకు పాల్పడుతున్న అప్రతిష్ఠాకరమైన ఘనత ఒకవైపు దేశ ప్రజలను మతపరంగా విడగొట్టి మైనారిటీలపై మెజారిటీని రెచ్చగొడుతుంటే మోహన్ భగవత్ భారతీయులందరి డిఎన్‌ఎ ఒకటేనని మాట్లాడడం విడ్డూరమనిపించదా?
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న దశలో ఆయన ఇలా మాట్లాడడాన్ని అనుమానపు దృష్టితో చూడకుండా ఉండగలమా? ఆదివారం నాడు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ వేదిక అయిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ సభలో మాట్లాడుతూ భగవత్ ఈ గొప్ప ఐక్యతా సందేశాన్ని ఇచ్చారు. వాస్తవానికి ఇవి దేశ సమగ్రతకు బలమైన సిమెంట్ వంటి మాటలు, అసమానమైన ఉద్బోధలు. అయితే గత ఏడేళ్లలో బిజెపి సంఘ్ పరివార్ శక్తుల విద్వేష యంత్రం నుంచి ముస్లిం వ్యతిరేక దుష్ప్రచారం అవధులు మీరి ఉత్పన్నమైంది. హిందువులు, ముస్లింలు ఒకరినొకరు అనుమానంతో చూసుకోవలసిన దుస్థితిని ఈ శక్తులు దాపురింప చేశాయని చెప్పడం ఎంత మాత్రం అబద్ధం కాబోదు.
జనాభాలో 90 శాతానికి పైగా ముస్లింలే ఉన్న లక్షద్వీప్‌లో జంతు వధను నిషేధించడం ఆ వర్గం ఆహారాన్ని లక్షంగా చేసుకొని తీసుకున్న చర్య కాదా? బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్దేశాలకు వ్యతిరేకంగా హిందుత్వ అజెండాను అమలు చేస్తూ ముస్లింలను ద్వేషించడం, వారిని నిరంతరం భయంలో ఉంచడమే పాలనా విధానంగా చేసుకున్న మాట వాస్తవం కాదా? తబ్లిగీ ఉదంతం గాని, సిఎఎ (పౌరసత్వ సవరణ చట్టం) వ్యతిరేక ఉద్యమకారుల అణచివేతగాని, లౌ జిహాద్ వ్యతిరేక ప్రచారం గాని ఏమి చాటాయి? అయితే ఎంత చెడు జరిగినా ఒకింత మంచి సంభవించకూడదనేదేమీ లేదు. దేశ క్షేమం కోరి హిందుత్వ శక్తుల్లో విప్లవాత్మకమైన మార్పు రాకూడదనీ లేదు.
అయితే మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారానే బిజెపి అధికారంలోకి వచ్చిందన్న సంగతిని ఎవరూ మరచిపోలేరు. అది మళ్లీ తమకు అధికారం కట్టబెడుతుందనే ఆశలు కలిగితే దాని వల్ల దేశ ప్రజలు చీలిపోయినా వెనుకాడకుండా ఆ మార్గాన్ని మరింతగా అనుసరించడానికి హిందు త్వ శక్తులు వెనుకాడవు. సంఘ్ రాజకీయాలు చేయదని, ప్రతిష్ఠను పెంచుకునే ఆరాటం కూడా దానికి లేదని జాతిని బలోపేతం చేయడానికే అలసట లేకుండా చేస్తుందని కూడా మోహన్ భగవత్ అన్నారు. ఐక్యత లేనిదే అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. అవన్నీ ఆర్‌ఎస్‌ఎస్‌లో వచ్చిన మార్పుకి నిదర్శనాలని అనుకోవాలా, ఈ మార్పు నిజమైనదేనా?