Sunday, January 19, 2025

మృతదేహాల గుర్తింపునకు డిఎన్‌ఎ శాంప్లింగ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: బాలాసోర్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి వివిధ ఆసుపత్రులలో ఇప్పటికీ 100 మందికి పైగా ప్రయాణికుల మృతదేహాలు గుర్తింపునకు నోచుకోకపోవడంతో భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ వైద్యులు డిఎన్‌ఎ శాంప్లింగ్ ప్రక్రియను మొదలుపెట్టినట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు.

రైలు ప్రమాదంలో తమ ఆప్తులను కోల్పోయిన వారి నుంచి ఇప్పటివరకు 10 శాంపిల్స్‌ను సేకరించినట్లు ఎయిమ్స్, భువనేశ్వర్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మృతదేహాలను ఎక్కువ కాలం భద్రపరచడానికి వీలుగా వాటిని ఐదు కంటెయినర్లలోకి మార్చినట్లు ఆయన చెప్పారు. మృతదేహాలను కంటెయినర్లలో ఆరు నెలల వరకు భద్రపరచవచ్చని, డిఎన్‌ఎ శాంప్లింగ్ తర్వాత మృతదేహాలను త్వరితంగా దహనం లేదా ఖననం చేయవలసిన అవసరం ఉండదని ఆయన తెలిపారు.

రైలు ప్రమాదంలో మరణించిన 278 మంది ప్రయాణికులలో ఇప్పటివరకు 177 మందిని గుర్తించడం జరిగిందని, మిగిలిన 101 మందిని గుర్తించిన తర్వాత మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తామని ఆయన చెప్పారు. ఎయిమ్స్ భువనేశ్వర్‌కు 123 మృతదేహాలు చేరుకోగా వీటిలో 64 మృతదేహాల గుర్తింపు జరిగింది.

ఇలా ఉండగా&ఉపేంద్ర కుమార్ శర్మ అనే ప్రయాణికుడి మృతదేహాన్ని సోమవారం గుర్తించానని, అయితే ఆ మృతదేహాన్ని వేరే వారికి అప్పగించారని జార్ఖండ్‌కు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని వేరే వారికి అప్పగించిన తర్వాత డిఎన్‌ఎ శాంప్లింగ్ చేసి ప్రయోజనం ఏమిటని ఆ వ్యక్తి ప్రశ్నించారు. శరీరంపైన ఉన్న పచ్చబొట్టు ద్వారా ఉపేంద్రను గుర్తించినట్లు ఆ వ్యక్తి తెలిపాడు.

కాగా..పూర్తిగా విచారించిన తర్వాతే మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తున్నామని ఎయిమ్స్ భువనేశ్వర్ డాక్టర్ ప్రవాస్ త్రిపాఠి తెలిపారు. ఒక మృతదేహం కోసం ఒకటికి మించి కుటుంబాలు అడుగుతున్న మాట వాస్తవమేనని, అందుకు డిఎన్‌ఎ శాంప్లింగ్ జరుగుతోందని ఆయన చెప్పారు.డిఎన్‌ఎ శాంప్లింగ్ నివేదిక రావడానికి 7 నుంచి 10 రోజులు పడుతుందని ఆయన చెప్పారు.

కాగా..మృతులలో అత్యధికులు పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాకు చెందినవారు.
ఇదిలా ఉండగా బాలాసోర్ రైలు ప్రమాద ఘటనపై మూడు దర్యాప్తు సంస్థలు&సిబిఐ, కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ, జిఆర్‌పి దర్యాప్తు ప్రారంభించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News