త్వరలో భారత ప్రభుత్వాన్ని కలుస్త్తా
నేతాజీ కుమార్తె అనిత బోస్ వెల్లడి
కోల్‌కత: జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచిన నేతాజీ సుభాష్ చంద్రబోసు అస్థికలకు డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించడం కోసం త్వరలోనే తాను భారత, జపాన్ ప్రభుత్వాలను సంప్రదిస్తానని నేతాజీ కుమార్తె అనిత బోస్ పాఫ్ తెలిపారు. నేతాజీ మరణంపై నెలకొన్న మిస్టరీని ఛేదించి ఆయన అస్థికలను తిరిగి భారత్‌కు రప్పించడమే 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న వేళ ఆయనకు ఇచ్చే నిజమైన నివాళని ఆమె అన్నారు. తన తండ్రి మరణంపై నెలకొన్న మిస్టరీ తన జీవిత కాలంలోనే అంతం కావాలన్నది తన కోరికని ఆమె చెప్పారు.
నేతాజీ అస్థికలకు డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించాలని త్వరలోనే తాను భారత ప్రభుత్వాన్ని కలసి అభ్యర్థిస్తానని ఆమె చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో డిఎన్‌ఎ పరీక్ష కోసం భారత ప్రభుత్వాన్ని సంప్రదించానని, అయితే తనకు సమాధానం రాలేదని అనిత తెలిపారు. ఇప్పుడు ఈ విషయంలో జాప్యం చేయబోనని, భారత ప్రభుత్వంతోపాటు జపాను ప్రభుత్వాన్ని కూడా సంప్రదించి నేతాజీ అస్థికలకు డిఎన్‌ఎ పరీక్ష చేయాలని కోరతానని ఆమె చెప్పారు. నేతాజీ అస్థికలను కొద్ది నెలల పాటు భద్రపరచవలసి ఉంటుందని తొలుత జపాను ప్రభుత్వం భావించిందని, కాని ఇపుడు 77 ఏళ్లు అయిందని జర్మనీలో నివసించే అనిత తెలిపారు.