కరోనా భయంతో టోక్యో ఒలింపిక్స్‌లో పతకాల ప్రదానంలో కొత్త ఒరవడి
టోక్యో: సాధారణంగా ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన వారికి పోడియంపై ప్రముఖులు పతకాలను మెడలో అలంకరింప జేసి వారితో కరచాలనాలు చేయడం రివాజు. అయితే వచ్చేవారం నుంచి ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్ప్‌లో మాత్రం ఈ ఉద్వేగభరిత అనుభవానికి క్రీడాకారులు దూరం కావలసి ఉంటుంది. కరోనా కారణంగా ఈ విధానానికి స్వస్తి చెస్పినట్లు ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షుడు థామస్ బచ్ బుధవారం ఏర్చువల్‌గా నిర్వహించిన మీడియా రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పారు. దీనికి బదులు పోడియంపై నిలుచున్న అథ్లెట్లకు ఒక ట్రేలో మూడు పతకాలను ఉంచి అందజేయడం జరుగుతుందని, అథ్లెట్లు తామే ఆ పతకాలను అలంకరించుకోవలసి ఉంటుందని ఆయన చెప్పారు. అంతేకాదు ట్రేలో పతకాలను ఎవరైతే పెడతారో వారు గ్లోవ్స్ ధరించి వాటిని ఉంచేలా చూస్తారని, అలాగే పతకాలు అందజేసే వారు, వాటిని అందుకునే అథ్లెట్లు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆయన చెప్పారు.
అంతేకాదు కరచాలనాలు, ఆలింగనాలు కూడా ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తున్న టోక్యో నగరంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఒలింపిక్స్ గేమ్స్ ముగిసే దాకా అంటే ఆగస్టు 8 వరకు ఆత్యయిక స్థితి విధించిన విషయం తెలిసిందే. నగరంలో బుధవారం 1,149 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరు నెలల కాలంలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలి సారి. క్రీడా మైదానాల్లోకి ప్రేక్షకులను ఎవరినీ అనుమతించకపోయినప్పటికీ ఒలింపిక్స్ కారణంగా కరోనా కేసులు పెరిగిపోతాయేమోనన్న భయంతో జపాన్‌లో ఒలింపిక్స్‌కు పెద్దగా ప్రజలనుంచి మద్దతు లభించడం లేదు.